Cm Chandrababu: పులివెందులలో ఈసారి తన అరాచకాలకు తావు లేదనే జగన్ అసహనం.. ప్రజలు ధైర్యంగా ఓటేశారు- సీఎం చంద్రబాబు

నామినేషన్ వేయటానికే భయపడే పరిస్థితుల నుంచి 11మంది నామినేషన్లు వేయగలిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. (Cm Chandrababu)

Chandrababu-Jagan

Cm Chandrababu: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై ఎదురుదాడికి దిగారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు.. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు చంద్రబాబు. పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికపై మీడియా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని ఆయన చెప్పారు.

2 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ ఎప్పుడైనా జరిగిందా?

పులివెందులలో ఎప్పుడూ తాను చేసే అరాచకాలు ఈసారి జరగలేదనే అసహనంతో జగన్ ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ నైజం ప్రజలకు తెలిసిందే అని అన్నారు. వైఎస్ హయాం నుంచి కూడా అక్కడ ప్రజాస్వామ్యబద్ధం ఎన్నిక జరగలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నామినేషన్ వేయటానికే భయపడే పరిస్థితుల నుంచి 11మంది నామినేషన్లు వేయగలిగారని చెప్పారు. రెండు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ ఎప్పుడైనా జరిగిందా? అని చంద్రబాబు అడిగారు. శాంతి భద్రతల నిర్వహణ పటిష్టంగా జరిగింది కాబట్టే ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారని సీఎం చంద్రబాబు అన్నారు. (Cm Chandrababu)

ఇవాళ మీడియాతో మాట్లాడిన జగన్.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదన్నారు. ప్రజాస్వామ్యం లేదని చెప్పడానికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకం రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు జగన్.

పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి మరీ రిగ్గింగ్ చేశారని జగన్ ఆరోపించారు. పోలీసులు దగ్గరుండి ఏజెంట్లను బూత్ లోపలికి పంపలేదన్నారు. ఏజెంట్‌ను బూత్ లోపలికి రానివ్వకుండా దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసేశారని అన్నారు. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిన పరిస్థితి దేశంలో ఎక్కడ చూడలేదని వాపోయారు.

”ఇష్టానుసారంగా పోలింగ్ కేంద్రాలను మార్చేశారు. దారికాచి మరీ ఓటర్లని అడ్డుకుని స్లిప్పులు లాక్కున్నారు. భద్రత పేరుతో వందలాది మంది పోలీసులను పెట్టి ఓటర్లని భయభ్రాంతులకు గురిచేశారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, అనంతపురం నుండి టీడీపీ రౌడీలు వచ్చారు. కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు.. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా..?” అని జగన్ ప్రశ్నించారు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపైన, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపైనా విరుచుకుపడ్డారు జగన్. రాష్ట్రంలో జరిగిన ఓట్ల అవకతవకల గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 48 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మరి ఆ విషయం రాహుల్ గాంధీకి తెలియదా? ఈ విషయాన్ని రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదు? అంటూ నిలదీశారు.

రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుతో ఫోన్ లో నిత్యం టచ్‌లోనే ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు జగన్. చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరని నిలదీశారు. అమరావతిలో ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి, అమరావతి నిర్మాణం పెద్ద స్కామ్, దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు..? నన్ను విమర్శిస్తారు తప్ప చంద్రబాబు తప్పులను ఎందుకు విమర్శించడం లేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు జగన్.(Cm Chandrababu)

Also Read: మూడేళ్లలో జరగబోయేది ఇదే.. నేను చెప్పేది వాస్తవం.. ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..