పార్టీ కార్యకర్తల పోరాటం, త్యాగాలే నేటి అధికారం.. మహానాడులో చంద్రబాబు

ఎన్నికల్లో జనసేన, బీజేపీల సహకారం మరువలేం. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరించటంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

CM Chandrababu

TTD Mahanadu 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ కడప మహానాడు అని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పార్టీ కార్యకర్తల పోరాటం, త్యాగాలే నేటి అధికారమని అన్నారు. పార్టీ పనైపోయిందన్న వాళ్ల పనైపోయింది తప్ప తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉందన్నారు. విధ్వంస పాలనలో ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన శ్రేణులకు వందనం.

 

కడపను క్లీన్ స్వీప్ చేద్దాం..
ఎన్నికల్లో జనసేన, బీజేపీల సహకారం మరువలేం. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరించటంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. మహానాడు వేదికగా సిద్దాంతాలు, విధానాలు, ఆలోచనలు పంచుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. దేవుడి గడప కడపలో జరిపే తొలి మహానాడు చరిత్ర సృష్టించబోతోంది. గత ఎన్నికల్లో కడపలో 10కి 7అసెంబ్లీ స్థానాలు గెలిచి సత్తా చాటాం. ఈసారి మరింత కష్టపడి క్లీన్ స్వీప్ చేద్దామ‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

బీసీలను శాసించే స్థాయికి తెచ్చాం..
దేశంలోని అనేక రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం యూనివర్సిటీ నాయకులే ఉన్నారు. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తెచ్చిన పార్టీ తెలుగుదేశం. రాజకీయాల్లో తెలుగుదేశం తెచ్చిన అతిపెద్ద విప్లవం సామాజిక న్యాయం. తెలుగుదేశం పార్టీని చూసే దేశంలోని అనేక రాజకీయ పార్టీలు బీసీలను గుర్తించటం ప్రారంభించాయి. దేశంలో కేంద్రం తీసుకున్న అనేక కీలక నిర్ణయాల్లో తెలుగుదేశం పాత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఆలోచించే విధానాలు దేశం రేపు ఆలోచిస్తుందనేది అనేక సార్లు రుజువైందని చంద్రబాబు అన్నారు.

శిక్ష ఆలస్యం కావొచ్చు.. అక్రమార్కులు తప్పించుకోలేరు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తులకు చోటు ఉండదని మహానాడు వేదికగా స్పష్టం చేస్తున్నా నని చంద్రబాబు అన్నారు. రాజకీయ అవినీతిని తెలుగుదేశం పట్టించుకోదనే అపోహ వద్దు. ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదని చంద్రబాబు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ అవినీతిపై పారదర్శకంగా విచారణ జరుగుతోంది. అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజలు మనకు ఇచ్చారు. శిక్ష ఆలస్యం కావొచ్చు.. కానీ, అక్రమార్కులు తప్పించుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. 1989 నుంచి అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తున్నాం. అసత్య ఆరోపణలు చేయకుండా అవినీతి పరుల భరతం పట్టేవరకూ రాజీలేని పోరాటం చేసింది ఒక్క తెలుగుదేశ పార్టీయే. ఓబుళాపురం అక్రమ మైనింగ్, రాజా ఆఫ్ కరప్షన్ అంశాల్లో తెలుగుదేశం పోరాటం నిజమని న్యాయస్థానాల్లో రుజువైంది. అవినీతి పరుల భరతం పడుతూనే వచ్చే పదేళ్లలో చేపట్టే విధానాలను ఆటో పైలట్ లో పెట్టి తెలుగు జాతిని నెంబర్1 స్థానంలో ఉంచుతామని చంద్రబాబు నాయుడు అన్నారు.