CM Chandrababu: మహానాడు వేదికపై సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్

మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని ప్రజలు నిరూపించారు. అహంకారంతో విర్రవీగిన వారికి కడప జిల్లా ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారు.

Cm Chandrababu: కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై కార్యకర్తలను ఉద్దేశించి సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన, ఆ పార్టీ అధినేత జగన్ పైనా నిప్పులు చెరిగారు చంద్రబాబు. జగన్ విధ్వంస పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనకబడిందని చంద్రబాబు వాపోయారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి పోయిందని ధ్వజమెత్తారు.

ఎన్నో సమస్యలున్నా ధైర్యంగా ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టేలా పని చేస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టిపైనే నా దృష్టి అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే నా జీవిత ధ్యేయం అన్నారు.

”రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలి. మహానాడును చూసిన తర్వాత కొండనైనా ఢీకొట్టే ధైర్యం వచ్చింది. కడపలో మహానాడు పెడతారా అని అనుకున్నారు. కడప టీడీపీ అడ్డా అని నిరూపించుకునేందుకు మహానాడును ఇక్కడ పెట్టాం. కడప జనసంద్రంగా మారింది. కడప.. తెలుగుదేశం పార్టీ అడ్డా అని నిరూపించాం. కడప రాజకీయం మారుతోంది. మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని ప్రజలు నిరూపించారు. అహంకారంతో విర్రవీగిన వారికి కడప జిల్లా ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారు” అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం కొనసాగింపు ఉండాలి, పార్టీ లేకుండా చేస్తామన్నారు అడ్రస్ లేకుండా పోయారు- నారా లోకేశ్

”ఉమ్మడి కడపలో పది సీట్లలో ఏడు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కడపలో 10కి 10 సీట్లు గెలుద్దాం. అధికారం కోసం కాదు ప్రజల జీవితాల్లో మార్పు కోసం పుట్టిన పార్టీ టీడీపీ. కార్యకర్తలు ఎన్నో అవమానాలు, అరాచకాలు, బూతులు ఎదుర్కొన్నారు. విధ్వంస రాష్ట్రాన్ని పునర్ నిర్మించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచాయి. రాష్ట్రాన్ని రక్షించేందుకు కూటమిని ఏర్పాటు చేశాం. పాలన ఎలా ఉండాలో చెప్పిన కేస్ స్టడీ టీడీపీ. ప్రభుత్వం, పార్టీ ఎలా ఉండకూడదో చెప్పిన కేస్ స్టడీ వైసీపీ.

94శాతం స్ట్రైక్ రేట్ తో, 57శాతం ఓట్ షేర్ తో విజయం సాధించాం. మొన్నటి ఎన్నికల్లో కొత్త వారికి సీట్లు ఇచ్చినా భారీ మెజారిటీతో గెలిచారు. కూటమి విజయంలో టీడీపీ కార్యకర్తల పాత్ర మరవలేనిది. వైసీపీ పాలనలో ఐదేళ్లలో ఎన్నో అవమానాలు పడ్డాం. బూతులు తిన్నాం. ఎంతో అణచివేత ఎదుర్కొన్నాం” అని చంద్రబాబు అన్నారు.