CM Jagan
CM Jagan reaction On Vijayawada bus stand incident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సోమవారం బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాల్ని బలి తీసుకుంది. బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా బస్సు చక్రాల కింద పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతిని వ్యక్తంచేశారు. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకు వెళ్లిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేసిన పూర్తి వివరాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు.
ఈ ఘటనలో కండక్టర్ వీరయ్యతోపాటు..ఓ మహిళా ప్రయాణికురాలు, ఓ చిన్నారి ఉన్నారని గుర్తించారు. అనూహ్యంగా జరిగిన ఈ విషాద ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం గేర్ సరిగ్గా పడకపోవడంతో బస్సు ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిందని భావిస్తున్నారు.దీనిపై పూర్తి విచారణకు సీఎం జగన్ ఆదేశించటంలో అధికారులు ఆ పనిలో పడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు ఆర్టీసీ కార్పొరేషన్ తరపున రూ. 5 లక్షలు పరిహారంగా అందిస్తామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు ప్రకటించారు.