రైతుల సంక్షేమం కోసం, కనీస మద్దతు ధరపై CM JAGAN కీలక ప్రకటన

  • Publish Date - October 1, 2020 / 06:58 AM IST

cm jagan : ఏపీలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధరలు (minimum-support-price) ప్రకటించనుంది. కనీస మద్దతు ధరలో రాజీ పడొద్దని సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం ఖరారు చేసే మద్దతు ధర కంటే తక్కువకు పంటలు కొనుగోలు జరగకూడదని స్పష్టం చేశార.
ఏపీలో రైతు సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేయనుంది.



ఏయే పంటకు ఎంత మద్దతు ధరో ఇస్తారో అధికారికంగా 2020, అక్టోబర్ 01వ తేదీ గురువారం ప్రకటించనుంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్దతు ధరలపై 2020, సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఖరారు చేసే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎక్కడా కొనుగోలు జరగకూడదని… వీలుంటే ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు.



రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌లో పోటీ ఏర్పడాలని… తద్వారా మెరుగైన ధర రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి… మార్కెట్‌లో పోటీ ఏర్పడేలా చేస్తుందన్నారు. గతేడాది రైతులకు కనీస గిట్టుబాటు ధర రావాలని దాదాపు 3200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం… పలు పంటలు కొనుగోలు చేసిందన్నారు సీఎం జగన్‌.



ఇంకా ధాన్యం కొనుగోలు కోసం మరో 11,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ఏడాది కూడా 3300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతులకు అస్సలు అక్కర్లేదని భరోసా ఇచ్చిన సీఎం… పంటలకు ముందుగానే ధరలు ప్రకటిస్తామని చెప్పారు.



ఇక రైతుల ఉత్పత్తులకు గ్రామాల్లో కూడా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడం కోసం జనతా బజార్లు ఏర్పాటు చేయాలన్నారు సీఎం జగన్‌. ఆ బజార్లలో తప్పనిసరిగా ఫ్రీజర్లు ఉండాలన్నారు. రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న Reliance, ITC, P & G, Hindustan Lever, లాంటి సంస్థలను కూడా జనతా బజార్లలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.



వీలైనంత త్వరగా జనతా బజార్లతో పాటు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పని రైతులకు మేలు చేసే విధంగా ఉండాలన్నారు. వారు ఎక్కడా నష్టపోకుండా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.