CM Jagan : కాపుల ఓట్లు చేజారకుండా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్

అలాంటి వ్యక్తిని వైసీపీలో చేర్చుకోవడమో లేక తగిన గుర్తింపు ఇవ్వడమో చేస్తే కాపుల ఓటు బ్యాంకు కాపాడుకోవచ్చన్నది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. CM Jagan

CM Jagan Master Plan

CM Jagan Master Plan : ఏపీ ఎన్నికల వ్యూహాల్లో భాగంగా సీఎం జగన్ సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో వెన్నదన్నుగా నిలిచిన కాపుల ఓట్లు కాపాడుకునే దిశగా పావులు కదుపుతున్నారు. కాపు ఓటు బ్యాంకు కొల్లగట్టేలా ప్రత్యర్థులు కూటమి కట్టడాన్ని నిశితంగా గమనించిన సీఎం జగన్ పద్మవ్యూహం పన్నుతున్నారు. తన మద్దతుదారుల్లో ఏ ఒక్కరూ చేయి జారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకీ సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? కాపు ఓట్లకు వేసిన ఎత్తులేంటి? వైసీపీ తెరవెనుక వ్యూహ రచన ఎలా ఉంది?

కాపు ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా సీఎం జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు కాపుల ఓట్లలో చీలిక తెచ్చేలా వేస్తున్న ఎత్తుగడలను చిత్తు చేసేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు జగన్. జనసేనాని పవన్ కల్యాణ్ ద్వారా కాపులను తన నుంచి దూరం చేసేలా ప్రత్యర్థులు వ్యూహం రచిస్తుంటే విరుగుడు చర్యలు ప్రారంభించారు సీఎం జగన్. గత ఎన్నికల్లో కాపుల మద్దతుతో ఉభయగోదావరి జిల్లాలలో రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్న వైసీపీ.. వచ్చే ఎన్నికల్లోనూ అలాంటి విజయం రిపీట్ కావాలనే వ్యూహంలో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఫోకస్ పెట్టింది.

Also Read: చిత్తూరు జిల్లాలో మూడు సీట్లపై జనసేన గురి.. డైలమాలో టీడీపీ నేతలు!

మాజీమంత్రి ముద్రగడతో ముఖ్యమంత్రి జగన్ త్వరలో భేటీ కానన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 9న తూర్పుగోదావరి జిల్లాకు వెళ్తున్న జగన్.. పనిలో పనిగా మాజీమంత్రి ముద్రగడను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాపు ఉద్యమ నేత ముద్రగడ రాజకీయంగా ప్రస్తుతం తటస్థంగా వ్యవహరిస్తున్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా కాపులకు పవన్ ఏం చేశారని ప్రశ్నిస్తూ లేఖాస్త్రాలు సంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తూ తన జాతిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని వైసీపీలో చేర్చుకోవడమో లేక తగిన గుర్తింపు ఇవ్వడమో చేస్తే కాపుల ఓటు బ్యాంకు కాపాడుకోవచ్చన్నది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. టీడీపీ-జనసేన కూటమి ద్వారా కాపుల ఓట్ల చీలిక లేకుండా ఉండాలంటే ముద్రగడ లాంటి బలమైన నాయకుడి మద్దతు అవసరమని భావిస్తోంది వైసీపీ.

రాజకీయంగా తటస్థంగా ఉన్న ముద్రగడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం ఒకటి ఉంది. జనసేన అధినేత పవన్ కు రాసిన లేఖల్లో వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేద్దాం రమ్మంటూ సవాల్ విసరడం ద్వారా తన అభిలాష వ్యక్తం చేశారు ముద్రగడ. గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయకపోయినా, అంతకుముందు 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు ముద్రగడ.

Also Read: సైకిల్-గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్.. బీజేపీపై పవన్ వైఖరి మారిందా?

2024లో ముద్రగడ లేదంటే ఆయన కుమారుడు పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించేలా నేరుగా సీఎం జగనే రంగంలోకి దిగడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత సీఎం జగన్ ఏ నాయకుడికి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి అయ్యాక ఓ తటస్థ నాయకుడిని కలిసే ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి కావచ్చు అంటున్నారు పరిశీలకులు. అంటే ముద్రగడ ద్వారా కాపులు తనకు ఎంత ప్రధానమో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. మరి ముఖ్యమంత్రి జగన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు