Cm Jagan Meets Niti Aayog Vice Chairman Rajiv Kumar In Delhగ
Niti Aayog vice-chairman Rajiv Kumar : ఢిల్లీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌తో భేటీ అయ్యారు. గురువారం (జూన్ 10)న నీతి ఆయోగ్ కార్యాలయంలో ఆయన్ను సీఎం కలిశారు. పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను సీఎం వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30.76లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలను సేకరించామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల 17,005 కొత్త కాలనీలు ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు.
ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామన్నారు. మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం సజావుగా సాగడానికి ప్రతి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌ను నియమించామని జగన్ పేర్కొన్నారు. 17,005 కొత్త కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రూ. 34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమని తెలిపారు. ఇళ్లు కట్టి.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుంటే.. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇళ్లపట్టాలుకోసం, నిర్మాణంకోసం పెట్టిన ఖర్చు ప్రయోజనాలను ఇవ్వదని జగన్ వివరించారు. సంబంధిత మంత్రిత్వశాఖలతో మాట్లాడి ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగా చేయాలని సీఎం కోరారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనా రాజీవ్‌కుమార్‌తో సీఎం మాట్లాడారు. పోలవరం పీపీఏతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి (టెక్నికల్ అడ్వైజరీ కమిటీ– టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం.. రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని సీఎం జగన్ కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలిపాలని రాజీవ్‌కుమార్‌ను సీఎం జగన్ కోరారు.