చిత్తూరు జిల్లా పెనమూరు ప్రభుత్వ డాక్టర్ అనితారాణి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై సీఐడీ విచారణకు సీఎం జగన్ ఆదేశించారు. నిజానిజాలేంటో తేల్చాలన్నారు. పెనమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా పని చేస్తున్న అనితా రాణి వైసీపీ నేతలు తనపై దాడి చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డాక్టర్ సుధాకర్ లాగే తనను కూడా వేధిస్తున్నారంటూ డాక్టర్ అనితా రాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు టార్గెట్ చేశారని వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదని డాక్టర్ అనితా రాణి ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న డీఎంహెచ్వో:
కాగా, చిత్తూరు జిల్లా డీఎంహెచ్ వో పెంచలయ్య వర్షన్ మాత్రం మరోలా ఉంది. అనితారాణి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారాయన. ఆమె అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. డాక్టర్ అనితా రాణి డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, ప్రజల నుంచి డాక్టర్ పై అనేక ఫిర్యాదులు అందాయన్నారు. రోగుల పట్ల ఆమె అమానుషంగా ప్రవర్తిస్తారని చెప్పారు. డాక్టర్ అనితా రాణి ట్రీట్మెంట్ సరిగ్గా చేయరని డీఎంహెచ్వో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
రంగంలోకి నారా లోకేష్:
మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుకుంది. డాక్టర్ సుధాకర్ లాగే దళిత మహిళ డాక్టర్ అనితా రాణిని దారుణంగా వేధించారని, వైసీపీ నేతల అవినీతికి సహకరించని కారణంగానే ఇలా చేస్తున్నారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు వైద్యురాలి వాయిస్ తో ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం దుమారం రేపడంతో జగన్ సీరియస్ అయ్యారు. సీఐడీ విచారణకు ఆదేశించారు. మొత్తం ఘటనలో నిజానిజాలు తేల్చాలని సీఐడీకి సూచించారు.