Vizianagaram Train Accident : ఘోర రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. Vizianagaram Train Accident

CM Jagan On Vizianagaram Train Accident

Vizianagaram Train Accident : విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, గాయపడ్డ వారికి సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.

Also Read : విజయనగరం రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు సాయం

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ రైలు ఢీకొట్టింది. దీంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అక్కడ కరెంటు లేక భీతావాహ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు.

Also Read : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

విశాఖ రైల్వేస్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు..
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

హెల్ప్ లైన్ నెంబర్స్
0891 2746330
0891 2744619
81060 53051
81060 53052
85000 41670
85000 41671