ప్రకాశం జిల్లాపై సీఎం జగన్ ఫోకస్, నాయకుల మధ్య విభేదాలపై సీరియస్

  • Publish Date - October 2, 2020 / 02:47 PM IST

cm jagan focus on prakasam: ప్రకాశం జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ప్రధానంగా దర్శి, చీరాల నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో సమవుజ్జీలైన నేతలుండడంతో వర్గ విభేదాలు హద్దులు మీరుతున్నాయి. చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్, మద్దిశెట్టి వేణుగోపాల్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. నేతల మధ్య వివాదాలు చినికిచినికి గాలివానగా మారి అధిష్టానానికి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి. దీంతో జిల్లాలోని రాజకీయ పరిస్థితులను సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్.. ప్రత్యేక దృష్టి సారించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి నివేదిక తెప్పించుకున్న సీఎం జగన్:
ఇప్పటికే జిల్లాలోని నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ ఎమ్మెల్యేల పని తీరు, పార్టీ వ్యవహారాల్లో వారి పాత్ర, మాజీల వ్యవహారాలు అంతర్గత పోరుకు దారి తీసిన పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ముఖ్యమంత్రి జగన్ నివేదిక తెప్పించుకున్నారట. దానికి అనుగుణంగా జిల్లాలో పరిస్థితులను సమీక్షించి త్వరలోనే వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా జగన్‌ చర్యలు తీసుకోబోతున్నారని చెబుతున్నారు.

జెండా మోసిన కార్యకర్తలను, సోషల్ మీడియాలో యాక్టివ్ గా పని చేసిన వారిని విస్మరించారు:
మరోవైపు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పనిచేసిన కార్యకర్తలను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లిందని అంటున్నారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలను గుర్తించేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి రావడం వెనుక సోషల్ మీడియా కార్యకర్తల కృషి ఎంతో ఉంది. అలాంటి వారి సేవలను మరింతగా వినియోగించుకోవాలని భావిస్తున్నారట.

ఇప్పటికిప్పుడు నాయకత్వాన్ని మార్చకుండా:
టీడీపీ గెలిచిన నాలుగు నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులు, నాయకుల సామర్ధ్యం, ఓటమికి కారణాలపై నివేదికలు తెప్పించుకున్న సీఎం.. ఓ అంచనాకు వచ్చారని అంటున్నారు. పర్చూరు, అద్దంకి, కొండపిలో నాయకుల సామర్థ్యంపై ఓ అంచనాకు వచ్చారట. నాలుగింటిలో చీరాల ఎమ్మెల్యే బలరాం ఇప్పటికే వైసీపీకి సానుభూతిపరుడిగా మారడంతో అద్దంకి, కొండపిపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికిప్పుడు నాయకత్వాన్ని మార్చకుండా అప్రమత్తం చేసి, తగు సూచనలు ఇవ్వడం ద్వారా ప్రజల్లో పట్టు సాధించడానికి మరికొంత సమయాన్ని ఇవ్వాలని భావిస్తున్నారట.

పర్చూరులో నాయకత్వం మార్పు:
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైసీపీకి వస్తారని భావించినా, చివరి క్షణంలో తన ఆలోచన మార్చుకున్నారు. దీంతో ఆయనను ఎదుర్కొనే బలమైన నాయకుడు అవసరమని వైసీపీ అధిష్టానం గుర్తించిందట. ప్రస్తుతం రావి రామానంద బాబు అక్కడ పార్టీ కార్యకలాపాలు చూస్తున్నా ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారట. అక్కడ నాయకత్వాన్ని మార్చి వచ్చే ఎన్నికల నాటికి సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై జగన్‌ దృష్టి సారించడంతో కొందరు నేతలు ఏం జరుగుతుందోనని ఎదురు చూస్తున్నారు.