ఏపీ సీఎం జగన్ గురువారం(జూన్ 4,2020) వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఆటో, ట్యాక్సీ యజమానుల ఖాతాల్లో రెండో విడత రూ.10వేలు జమ
ఏపీ సీఎం జగన్ గురువారం(జూన్ 4,2020) వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఆటో, ట్యాక్సీ యజమానుల ఖాతాల్లో రెండో విడత రూ.10వేలు జమ చేశారు. 2లక్షల 62వేల 493మంది లబ్దిదారులకు నేరుగా సాయం అందింది. ఈ ఏడాది అదనంగా 37వేల 756మంది లబ్ది కలిగింది. పథకాన్ని ప్రారంభించిన తర్వాత మాట్లాడిన సీఎం జగన్.. నాలుగు నెలలు ముందుగానే రెండో విడత సాయం చేశామని చెప్పారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలను స్వయంగా చూశానని అన్నారు. పేదవాడి పరిస్థితిని గత ప్రభుత్వం అర్థం చేసుకోలేదన్నారు. కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఎటువంటి పథకాలు ఆగలేదని జగన్ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ మాటనిలుపుకున్న సీఎం జగన్:
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైనా.. ఉపాధి లేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 37,756 వేల మంది ఈ పధకానికి దరఖాస్తు చేసుకున్నారు. 2019లో లబ్ది పొందిన 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఆన్ లైన్ ద్వారా అకౌంట్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. మొత్తం 2,62,493 మంది లబ్దిదారులకు ప్రయోజనం కలిగింది.
4 నెలలు ముందుగానే రెండో విడత సాయం:
ఈ పథకంలో భాగంగా.. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్‌లో ఇవ్వాల్సి ఉన్నా కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఎంపికైన మొత్తం 2,62,493 మంది లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,590 మంది ఈబీసీలు, 29,643 మంది కాపులు.. 10,049 మంది ఎస్టీలు.. 28,118 మంది మైనార్టీలు.. 581 బ్రాహ్మణ, 1,026 మంది క్రైస్తవులు ఉన్నారు. నాలుగు నెలల ముందుగానే రూ.10వేలు ఇవ్వడం పట్ల డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
అండగా ఉంటానని హామీ ఇచ్చిన జగన్:
బతుకుదెరువు కోసం ఆటోలు, మ్యాక్సీలు నడుపుకుంటున్న డ్రైవర్లకు అండగా ఉంటానని ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం వారికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేయడం ద్వారా అండగా నిలుస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా ఆటో, మ్యాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్న దాఖలాలు లేవని, మన రాష్ట్రంలో ప్రతి ఏటా రూ. 10 వేలు అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వైసీపీ నేతలు చెప్పారు. నిరుపేదలైన తమకు ఈ మొత్తం ఎంతో ఉపయోగపడుతుందని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు అన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా రెండున్నర నెలలుగా బాడుగలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇలాంటి కష్ట కాలంలో రూ.10వేలు సాయం చేసిన ముఖ్యమంత్రికి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
Read: ఏపీలో ఇవాళ రెండో విడత వాహనమిత్ర.. ఆన్ లైన్ ద్వారా అకౌంట్ లో రూ.10 వేలు