CM Jagan Letter : తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

ప్రధాని మోడీకి మరోసారి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు.

CM Jagan Letter : ప్రధాని మోడీకి మరోసారి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. కేఆర్ఎంబీ ప్రొటోకాల్ ను ఉల్లంఘించి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. కేఆర్ఎంబి పరిధిని వెంటనే నోటిఫై చేయాలని లేఖలో కోరారు. కేఆర్ఎంబి పరిధిని నోటిఫై చేసేలా తక్షణమే జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన ఇరిగేషన్, విద్యుత్, తాగునీరు, ఉమ్మడి రిజర్వాయర్లకు చెందిన అధికారులను కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురావాలని విజ్జప్తి చేశారు. ఆయా ప్రాజెక్టుల వద్ద సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ పునర్వివస్ధీకరణ చట్టం 2014 ను అనుసరించి నిర్వహణ చేపట్టాలని విజ్జప్తి చేశారు.

కృష్ణా డెల్టా పరిధిలో సాగునీటి అవసరం లేకపోయినా విద్యుత్ ఉత్పత్తితో నీటిని వృధా చేస్తున్నారని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన 26 టీఎంసీల్లో 19 టీఎంసీలను విద్యుత్ ఉత్పత్తికే వాడేశారని తెలిపారు. జూన్ 1 నుంచి విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ రెట్టింపు చేసిందన్నారు. ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పులిచింతల నీటిని విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ తీరుతో జలాలన్నీ వృధాగా సముద్రంలోకి పోతున్నాయని చెప్పారు. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఇప్పటికే జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే కేంద్ర జోక్యం చేసుకోవాలని జగన్ లేఖలో కోరారు.

ట్రెండింగ్ వార్తలు