CM Jagan visit to West Godavari Narasapuram city..Chandrababu Naidu criticizes tree cutting
Andhra Pradesh : సీఎం జగన్ పర్యటన అంటే అట్లుంటది మరి అన్నట్లుగా ఉంది నరసాపురంలో సీఎం పర్యటన. జగన్ పర్యటన సందర్భంగా పర్యటనకు ఏమాత్రం అడ్డులేని చెట్లను కూడా నరికివేస్తున్నారని ఇదేం ఖర్మరా బాబూ అంటూ ఎద్దేవా చేసారు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ బయటకు వస్తున్నారంటే తాడేపల్లి అంతా అన్ని షాపులు బంద్ అయిపోవాల్సిందేనని విమర్శలున్నాయి. అంతేకాదు జగన్ బయటకకు వస్తే పరదాలు కట్టుకుని వస్తారని ప్రతిపక్షాలువివర్శిస్తుంటాయి. కానీ సీఎం జగన్ నరసాపురం పర్యటనలో అంతకు మించి అన్నట్లుగా ఏకంగా భారీ వృక్షాలనే నరికివేస్తున్నారని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా విమర్శలు కురిపించారు.
ప్రజలకు మొక్కలు నాటాలని నేర్పాల్సిన పాలకులు…చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా? ఇదే కదా రివర్స్ పాలన అంటే… నువ్వు జగన్ రెడ్డి కాదు… రివర్స్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు. సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లూ చూశాం. కానీ సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను…అది కూడా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం అంటూ విమర్శించారు. నువ్వు జగన్ రెడ్డి కాదు… రివర్స్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు నరసాపురంలో చెట్లను నరికివేసిన చెట్ల ఫోటోలను కూడా షేర్ చేశారు.
ఏపీలో సీఎం జగన్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల అడ్డగింతలు, అనవసర నియంత్రణలు షరా మామూలుగా మారిపోయాయి. ఈక్రమంలో సోమవారం (నవంబర్ 21,2022) పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జగన్ పర్యటించనున్న క్రమంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అవసరం ఉన్నా.. లేకున్నా పట్టణ పరిధిలోని చాలా చెట్లను నరికివేశారు. అదేమని ప్రజలు ప్రశ్నిస్తే విద్యుత్తు తీగలకు, సీఎం కాన్వాయ్‌కు అడ్డుగా ఉన్నాయని అందుకే తొలగించామని చెబుతున్నారు.
కాగా..ఈ పర్యటనలో జగన్ నరసాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో నూతన భవనాలు, ఆర్టీసీ బస్టాండు ప్రారంభోత్సవాలు.. ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపనలను సీఎం సభా ప్రాంగణం నుంచే చేస్తారు. అయినా పెద్ద ఎత్తున కూలీల్ని పెట్టి హెలిప్యాడ్ మొదలు ప్రయాణ ప్రాంగణం వరకూ దారి పొడవునా భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం లేదంటే అదీ లేదు మా ఇష్టమొచ్చినట్లుగా చేస్తామనే ధిక్కారం.
కాగా..నరసాపురం పట్టణంలోని థామస్ వంతెనవైపుగా సీఎం కాన్వాయ్ వెళ్లడం లేదు. అయినా అక్కడా చెట్ల కొమ్మలను కూడా నరికివేసిన పరిస్థితి. మేదర్ల వంతెన, ట్యాక్సీ స్టాండ్ ఏరియాలోనూ పెద్ద ఎత్తున చెట్లు, కొమ్మలను తొలగించారు. సీఎం కాన్వాయ్ వచ్చే మార్గంలో డివైడర్‌కు రెండువైపులా ఉన్న చెట్ల కొమ్మలు నరికేసి ఫ్లెక్సీలు పెట్టారు.