రైతుల ఖాతాలో పంటల బీమా పరిహారం : గత ప్రభుత్వం బకాయిని తీర్చిన సీఎం జగన్

కరోనా వేళ ఎన్ని కష్టాలు, ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నా..ఇచ్చిన హామీలు పూర్తి చేయడానికే సీఎం జగన్ ముందుకు కదులుతున్నారు. ఆయా రంగాలకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేస్తూ..లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు.

తాజాగా 2018-19కి పంటల బీమా బకాయిలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. బీమా ప్రీమియం (వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా) కింద రూ. 596.36 కోట్లు విడుదల చేసింది. 2020, జూన్ 26వ తేదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

గతంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. రైతుల పంట బీమా కింద రూ. 126 కోట్ల బకాయిలు పెట్టింది. దీంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను విడుదల చేశారు. బీమా చెల్లింపుతో 5, 94, 005లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. రైతుల ఖాతాల్లోకి నేరుగా పరిహారం అందనుంది.

రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ – క్రాప్ నమోదు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ క్రాపింగ్ అయిన వెంటనే బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం రైతులు రూపాయి కడితే చాలు.. రైతులు భరోసా కేంద్రంలోనే ఈ – క్రాపింగ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్‌ కలిసి ఈ – క్రాపింగ్‌ రిజిస్టర్‌ చేసి.. వెంటనే ఇన్సూరెన్స్‌ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని.. బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

రైతులకు ఉచితంగానే బీమా అందిస్తున్నామన్నారు. రైతులు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని మరోసారి హామీనిచ్చారు సీఎం జగన్. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పంటల విషయంలో సలహాలు, సూచనలు అందచేస్తామని సీఎం జగన్ తెలిపారు.

Read: అనంతపురం, కర్నూలులో కరోనా బెల్స్