భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు వేగవంతం

  • Publish Date - August 18, 2020 / 09:12 PM IST

భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూసర్వే పనులు వేగవంతం చేస్తోంది. ఎయిర్ పోర్టును నిర్మించనున్న జీఎంఆర్ సంస్థకు భూములను అప్పగించేందుకు రెడీ అయ్యింది. ఈ నెలాఖరులోగా మొదటి విడతగా కొంత భూమిని అప్పగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.



ఇప్పటికే భూ సేకరణ పూర్తి
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రక్రియకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసిన అధికార యంత్రాంగం.. ఆ భూముల సరిహద్దుల కోసం సర్వే చేపట్టింది. ఈ నెలాఖరులోగా సర్వే పనులు పూర్తి చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు.

జీఎంఆర్‌కు ఎయిర్‌పోర్టు నిర్మాణ బాధ్యతలు
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం ఇప్పటికే జీఎంఆర్‌కు అప్పగించింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్‌ కూడా సన్నద్ధమవుతోంది. దీంతో ఈ నెలాఖరులోగా విమానాశ్రయం కోసం సేకరించిన భూమిలో కొంత జీఎంఆర్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.



ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2,200 ఎకరాలు
ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఇప్పటికే భోగాపురం మండలంలో 2,700 ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. ఇందులో 2,200 ఎకరాలను ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థకు అప్పగించనుంది. మూడు రాజధానులు పరిపాలనలో భాగంగా విశాఖకు పరిపాలన రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంలో ప్రభుత్వం ఉంది.

తొలి విడతగా 1500 ఎకరాలు అప్పగింత!
రైతుల నుంచి సేకరించిన భూమికి సరిహద్దులు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడి భూసర్వేలు నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరు సర్వేను పూర్తి చేసి… జీఎంఆర్‌కు మొదటి విడతగా 1500 ఎకరాల అప్పగించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.



భోగాపురం అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం
మరోపక్క 16వ నెంబరు జాతీయ రహదారి నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లే అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే జాతీయ రహదారిపై బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్డి నుంచే అప్రోచ్‌ రోడ్డు వెళ్తుంది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అప్రోచ్ రోడ్డును నిర్మిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వైపుల నుంచి వచ్చే వాహనాలు ఈ అప్రోచ్ రోడ్డు ద్వారా ఎయిర్ పోర్టుకు వెళ్లే విధంగా రోడ్డు నిర్మాణాన్ని డిజైన్ చేశారు.