ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరో రెండు కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడలో ఒక్కో కేసు నమోదైంది. కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి, రాజమహేంద్రవరంలో 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా సోకినవారిలో నెల్లూరు, విశాఖ నుంచి ఒకొక్కరు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ఆదివారం 2 పాజిటివ్ కేసులు విశాఖలో నమోదయ్యాయి. బర్మింగ్‌హామ్ నుంచి విశాఖకు ఈ నెల 17వ తేదీన వచ్చిన వ్యక్తి ద్వారా ఇద్దరికి వైరస్ సంక్రమించిందని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతున్నా… కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు ఇప్పటి వరకు మొత్తం 649 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించగా అందులో 23 పాజిటివ్, 526 నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 100 మంది అనుమానితుల నమూనాల ఫలితాల కోసం వేచిచూస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా ఇప్పటి వరకు విదేశాల నుంచి 29,672 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారిల 29,494 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా.. 178మందికి ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించింది వైద్య ఆరోగ్యశాఖ.
కరోనా వైరస్ కట్టడికి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ సోకిన వారిని ఆస్పత్రికి తీసుకురావాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు. ఆయా జిల్లాల్లో ఐఏఎస్‌లే వైరస్ బాధితులకు చికిత్స అందించాలని కోరారు. క్వారంటైన్, ఐసోలేషన్ వద్ద పనిచేయడానికి నాన్ మెడికల్ వాలంటీర్లు అవసరం ఉంది అని, ఔత్సహికులు రావాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు కీలకమైన రవాణా సాయం చేయడానికి కూడా ప్రజలు ముందడుగు వేయాలన్నారు. సరుకులు తీసుకునే విషయంలో రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించాలని స్పష్టంచేశారు.
కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోబోతున్నామన్నారు మంత్రి కన్నబాబు. సీఎం జగన్ సూచనల మేరకు ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కేసుల సంఖ్య పెరిగితే ప్రభుత్వ భవనాలతో పాటు… హోటళ్లు, మండపాలను క్వారంటైన్ సెంటర్లుగా చేస్తామన్నారు. అలాగే ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ సీఎం ఆదేశించినట్లు తెలిపారు కన్నబాబు.
See Also | తెలంగాణలో కరోనాతో మరొకరి మృతి..77కు చేరిన పాజిటివ్ కేసులు