ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కాగా ఏదైతే జరక్కూడదని అంతా ఆశించారో అది జరిగింది. శ్రీకాకుళం జిల్లాను కూడా కరోనా తాకింది. జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలోని పాతపట్నం మండలంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో జిల్లా వాసులు, అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆ మూడు కేసులు కూడా ఒకే కుటుంబంలో వారికే నిర్థారణ అయినట్లు తెలుస్తోంది.
కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 31కి చేరింది. ఇప్పటి వరకు 171 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఇప్పటివరకు 275 కేసులు, గుంటూరు జిల్లాలో 209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రెండు జిల్లాల్లో మరింత పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని భావిస్తున్న తరుణంలో ఇవాళ(ఏప్రిల్ 25,2020) శ్రీకాకుళం జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.