ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఏపీలో శుక్రవారం (మార్చి 27, 2020) మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
ఉదయం విశాఖకు చెందిన ఓ యువకుడికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇటీవలే బర్మింగ్‌హామ్ నుంచి అతని కుటుంబం విశాఖపట్నం వచ్చింది. కుటుంబసభ్యుల్లో అతనికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ప్రత్యేక ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు.
గుంటూరులో తొలి కాంటాక్టు కేసు నమోదైంది. కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లాకు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ధృవీకరించింది. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధిత మహిళ ఏపీలో నమోదైన పదో కరోనా పేషెంట్ భార్యగా గుర్తించారు. అయితే ఈ రెండు కూడా కాంటాక్టుకు సంబంధించిన స్టేజ్ 2కు సంబంధించిన పాజిటివ్ కేసులుగా ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 406 మంది కరోనా అనుమానితులుకు కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు చెప్పారు. ఇందులో 317 మందికి కరోనా నెగెటివ్, 13 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. మిగతావారికి సంబంధించిన రిపోర్ట్స్ పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.
Also Read | మాజీ కేంద్రమంత్రి బేణీప్రసాద్ వర్మ కన్నుమూత