ఏపీలో కరోనా : ఫస్ట్ ప్లేస్ కర్నూలు, సెకండ్ ప్లేస్ గుంటూరు

  • Publish Date - April 11, 2020 / 02:30 AM IST

కరోనా పాజిటివ్ కేసుల్లో కర్నూలు మొదటిస్థానంలో ఉంది. ఆఫ్ సెంచరీ క్రాస్ చేసి సెంచరీ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 77 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు పోలీసులు. 

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు హాఫ్ సెంచరీ దాటాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 58 కేసులు నమోదయ్యాయి. మర్కజ్ నిజాముద్దీన్ సదస్సుకు వెళ్లివచ్చిన వారి వల్లే కేసులు పెరుగుతుండటంతో అధికారులు వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విదేశీ ముస్లింలు గుంటూరు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 

సత్తెనపల్లిలోని ఓ మసీదులో దాక్కున్న 10మంది విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్కు పంపించారు. వీసా నిబంధనలు ఉల్లంఘించిన కజకిస్తాన్ వాసులపై కేసులు నమోదు చేశారు. ఆరోగ్య విపత్తు చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.(తెలంగాణ కేబినెట్ కీలక భేటీ..లాక్ డౌన్ పొడిగింపు)

కరోనా దెబ్బకు ప్రకాశం జిల్లా విలవిలలాడుతుంది. జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య 40కి చేరింది. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి చూస్తే రెండో స్టేజి నుంచి మూడో స్టేజీకి చేరుతుందని అధికారులు చెప్పడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.  అటు నెల్లూరులో 48, కృష్ణా జిల్లాలో 35, కడప 29, పశ్చిమ గోదావరిలో 22, చిత్తూరు  జిల్లాలో 20, విశాఖపట్నంలో 20, అనంతపురంలో 15 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.