ఏపీలో కరోనా : మాస్క్ లేదా..అయితే..రూ. 1000 కట్టాల్సిందే

  • Publish Date - April 10, 2020 / 06:47 AM IST

ఏపీలో కరోనా మహమ్మారీ వీడడం లేదు. కేసులు తక్కువవుతాయని అనుకుంటే అలా జరగకపోతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సీఎం జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. 2020, ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం మరో రెండు కేసులు నమోదయ్యాయి.

దీనిని నివారణకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. మాస్క్ లు ధరించాలని సూచిస్తున్నారు. కానీ కొంతమంది ఏమీ లేకుండానే బయటకు వస్తుండడంపై అధికారులు సీరియస్ అయ్యారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే..రూ. 1000 ఫైన్ వేయ్యాలని నిర్ణయించారు. (కరోనా : మాస్క్ ధరించకపోతే జైలుకే..ఎక్కడో తెలుసా)

ఏపీలో ప్రధానంగా గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు వస్తే..తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని అధికారులు సూచించారు.

ఒకవేళ మాస్క్ లు వేసుకోకపోతే..రూ. 1000 జరిమాన విధిస్తామని హెచ్చరించారు. ఇంటికి అవసరమయ్యే నిత్యావసర సరుకులు, ఇతర వాటిని కొనుగోలు చేయడానికి కేవలం ఒక్కరే రావాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు ఆఫీసులకు చేరుకోవాలన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు రహదారులపైకి ఉద్యోగులను అనుమతించేది లేదని అధికారులు ఖరాఖండిగా చెప్పారు.