COVID – 19 : క్యాంపుల్లో పరిస్థితి ఎలా ఉంది..సీఎం జగన్ ఆరా

  • Publish Date - April 3, 2020 / 09:24 AM IST

ఏపీ రాష్ట్రంలో కోవిడ్  19 వైరస్ పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తొలి మరణం సంభవించింది. ఈ క్రమంలో మరోసారి 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైరస్ పరిస్థితిపై ఆరా తీశారు. వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి, కల్పిస్తున్న ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. క్యాంపుల్లో ఎంతమంది ఉన్నారన్న దానిపై జిల్లాల వారీగా పూర్తిస్థాయిలో వివరాలు తెప్పించామన్నారు అధికారులు.

ప్రభుత్వం నడుపుతున్న శిబిరాలు, వివిధ కంపెనీలు, మిల్లుల్లో పని చేస్తున్న వారు, అలాగే వివిధ క్వారీల్లో, గనుల్లో పని చేసుకుంటూ అక్కడే ఉన్న వారు సుమారుగా 78 వేల మంది ఉన్నారని అధికారులు తెలిపారు. 236 క్యాంపులు నడుపుతూ 16 వేలమందికి స్వయంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తోందని, సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారిని ప్రతి క్యాంపు వద్ద నియమించడం జరిగిందన్నారు.

ప్రతి క్యాంపులో ఇద్దరి ఫోన్‌ నంబర్లు తీసుకుని ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నామన్నారు. మిగిలిన 62 వేల మందికి వివిధ కంపెనీ యాజమాన్యాల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా, ఇతరత్రా మార్గాల్లో భోజనం అందుతోందన్నారు. ఈ ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సరైన విధానం ద్వారా వారి బాగోగులు చూసుకోవాలని, లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14 వరకూ ఉన్నందున దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. (అమెరికా ప్రయోగం సక్సెస్.. రోగ నిరోధక శక్తిని పెంచుతున్న వ్యాక్సిన్)

 
*మంత్రులు ఆళ్లనాని, మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యన్నారాయణ హాజరయ్యారు. వీరితో పాటు సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఎప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌లో సడలింపు.. కొన్ని ప్రాంతాలకు పరిమితం)