Covid Patients Lost Gold And Money In Vizag Govt Covid Hospitals
Vizag Covid Patients Loss Money : కరోనాతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన రోగులను చూసుకోవాల్సిన ఆస్పత్రి సిబ్బందే.. వారిని నిండా దోచేస్తున్నారు. విశాఖలోని ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రుల్లో కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ.. సెల్‌ఫోన్లు, ఖరీదైన వస్తువులు, బంగారం, డబ్బులు.. ఇలా ఏది దొరికితే అది మాయం చేస్తున్నారు. చివరకు శవాలను కూడా వదలడం లేదు కొందరు కేటుగాళ్లు. సొమ్ములు ఎక్కడున్నాయో కనిపెట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
ఇలాంటి కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో.. కరోనా బాధితుల బంధువులు గగ్గోలు పెడుతున్నారు. సొమ్ములు పోయాయని పోలీసులను ఆశ్రయిస్తున్నా.. ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో పనిచేసే కొంతమంది కిందిస్థాయి సిబ్బంది.. బాధితులకు సాయం చేస్తున్నట్టు నటించి.. విలువైన వస్తువులను, ఆభరణాలను, డబ్బును కాజేస్తున్నారు. ఈ తరహా ఘటనలు విమ్స్, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి, కేజీహెచ్‌లో ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
చికిత్స పొందుతున్న సమయంలో బాధితుల ఒంటిపై ఆభరణాలు తీస్తే తెలిసిపోతుందని.. చనిపోయిన తరువాత కొట్టేస్తున్నారు. మృతదేహంపై ఏయే ఆభరణాలున్నాయో అధికారులకు తెలియజేసి.. వారి కుటుంబ సభ్యులకు అందించాలి. అయితే.. చెక్ చేసిన సమయంలో కొంతమంది కిందిస్థాయి సిబ్బంది ఆభరణాలు, డబ్బులు ఏమీ లేవని చెప్పేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా.. ఫలితం లేకుండా పోతోంది. అయితే.. బాధితుల ఫిర్యాదుతో వార్డుల్లోని సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీస్తే.. దొంగలను గుర్తించే వీలు ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.