Dadi Veerabhadra Rao
Dadi On Jagan Government : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవశకం మొదలైంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర విభజ తర్వాత ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 26 జిల్లాలతో రాష్ట్రం కొత్త రూపు దిద్దుకుంది. అంతేకాదు కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ కారణంగానే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్నా చంద్రబాబు చేయలేని పని.. మూడేళ్లలోనే జగన్ అన్నీ చేస్తున్నారు అని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకి రాని ఆలోచనలు జగన్ కు వస్తున్నాయని, రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.(Dadi On Jagan Government)
Chandrababu Naidu : కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలి
ఇది ఇలా ఉంటే.. కొత్త జిల్లాల ఏర్పాటు.. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేతను మనస్తాపానికి గురి చేశాయి. జగన్ పాలనపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధిష్టానంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అసహనంగా ఉన్నారు. జిల్లాల ఏర్పాటులో తనకు ఆహ్వానం అందలేదని ఆయన మనస్తాపం చెందారు. జిల్లాల ఏర్పాటులో తనకు కనీసం ఎటువంటి సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి పిలుపు లేదని దాడి వీరభద్రరావు వాపోయారు. టీవీలో సీఎం జగన్ మొహం చూసి ప్రసంగం విని ఆనందించా అని ఆయన చెప్పుకొచ్చారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాకు ఆహ్వానం కూడా రాలేదని దాడి వీరభద్రరావు ఆవేదన చెందారు. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రాతినిధ్యం కూడా లేదని వాపోయారు. తమను ఎవరు కాలు పెట్టి తోసేసినా పార్టీని గౌరవిస్తా అని దాడి వీరభద్రరావు చెప్పారు. ఎన్ని అవమానాలు ఎదురైనా జగన్ ఆశయాల కోసం పని చేస్తానని వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని దాడి వీరభద్రరావు సంచలన ఆరోపణలు చేశారు. ”నిజాయితీ పాలన అందుతుందా? లేదా? నిజమైన పాలన కింది స్థాయి ప్రజలకు చేరుతుందా? లేదా? విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. పోలీసులు, కబ్జాదారులు, తహశీల్దార్ లు కుమ్మక్కైపోయారు. జగన్ ఇదంతా చెక్ చేసుకోవాలి” అని దాడి వీరభద్రరావు సూచించారు.(Dadi On Jagan Government)
దాడి వీరభద్రరావు విశాఖలో మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా ఏర్పడిననందుకు సంతోషంగా ఉందన్నారు. అయితే అనకాపల్లి కొత్త జిల్లా ఏర్పాటుపై ఇటు అధికారుల నుంచి కానీ అటు పార్టీ నుంచి కానీ, ఎలాంటి ఆహ్వానం తనకు అందలేదన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవడం అసంతృప్తిగా ఉందన్నారు. పార్టీ పదవుల్లో ఉన్నవారిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన ఆన్ లైన్ విధానంతో రెవెన్యూ అస్తవ్యస్తమైందని, అది ఇప్పటికీ కొనసాగుతోందని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని దాడి వీరభద్రరావు అన్నారు.(Dadi On Jagan Government)
Laxmi parvathi: ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచేలా చంద్రబాబు ఒక్క పనిచేయలేదు.. జగన్ చేసి చూపించారు
అనకాపల్లి జిల్లా ఏర్పాటు కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు దాడా. సీఎం ఆశయాలకు అనుగుణంగా కొత్త జిల్లాల పరిపాలన జరుగుతుందా లేదా అనేది అనుమానమేనన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల రికార్డులు మార్చేశారని, రెవెన్యూ అధికారులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేసి లే ఔట్లుగా అమ్మేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ప్రత్యేక విభాగంతో దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దాడి వీరభద్రరావు చేసిన ఆరోపణలు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి.