జగన్ కు జై కొట్టిన సంచిత : 3 రాజధానులపై అశోక్ గజపతి రాజుకు కూతురు షాక్

  • Publish Date - January 23, 2020 / 08:02 AM IST

ఏపీ రాజధాని వికేంద్రీకరణ అంశం దుమారం రేపుతోంది. మూడు రాజధానులపై పెద్ద రచ్చ జరుగుతోంది. ప్రాంతాలకు అతీతంగా టీడీపీ నాయకులు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతే ముద్దు అని నినదిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సైతం మూడు రాజధానులను వ్యతిరేకించారు. జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇది ఇలా ఉంటే.. సొంత ఇంట్లోనే అశోక్ గజపతి రాజుకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అన్న(ఆనందగజపతిరాజు) కూతురు, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలు పూసపాటి సంచిత గజపతి రాజు షాక్ ఇచ్చారు.

రాజధాని వికేంద్రీకరణపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సంచిత స్వాగతించారు. బుధవారం(జనవరి 22,2020) ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంచిత గజపతిరాజు.. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వెనుకబడిన కర్నూలులో హైకోర్టు, విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర చంద్రబాబు బలవంతంగా లాకున్న భూమిలు తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు ముందే ఎందుకు పారిపోయి వచ్చారని సంచిత ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ.. రాజధానిపై పూర్తి నివేదిక ఇవ్వకుండానే అమరావతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధపడిందని సంచిత ఆరోపించారు. అమరావతి అనేది చట్ట విరుద్ధం నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా.. చంద్రబాబు బాధ్యత లేకుండా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీని ప్రజలు ఎ‍ప్పడో తిరస్కరించారని, రాజధానిపై మాట్లాడే కనీస హక్కు చంద్రబాబుకి, ఆ పార్టీ నేతలకు లేదన్నారు. అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను సంచిత ప్రశంసించారు. రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పడూ సహకారంగా ఉంటారని, దీనిలో రాజకీయం చేసే దురాలోచన ఆయనకు లేదన్నారు. రెండేళ్ల క్రితమే సంచిత బీజేపీలో చేరారు.

జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంచిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అటు అశోక్ గజపతి రాజు కుటుంబంలో, ఇటు బీజేపీ శ్రేణుల్లో సంచలనంగా మారాయి. ఎంతో అనుభవం ఉన్న బాబాయ్ అశోక్ మాటను కొట్టేస్తూ అమ్మాయి చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. అభివృద్ది వికేంద్రీకరణకు ఓకే.. పరిపాలన వికేంద్రీకరణను మాత్రం ఒప్పుకునేది లేదని బీజేపీ ఇప్పటికే స్టేట్ మెంట్లు ఇచ్చింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ బీజేపీ నేతలు ఓపెన్ గానే ఖండించారు. అంతేకాదు.. అమరావతి రాజధాని కోసం పోరాటాలకు రెడీ అవుతున్నారు. సంచిత మాత్రం.. జగన్ నిర్ణయాన్ని స్వాగతించి బీజేపీలో సంచలనం రేపారు. మరి సంచిత వ్యాఖ్యలపై బీజేపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Also Read : టీడీపీకి షాక్ : ఇద్దరు మాజీ మంత్రులపై సీఐడీ కేసులు