death certificate: ఓ మనిషి బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఇస్తారా..అని అడిగితే.. ఎవరైనా సరే.. క్షణం కూడా ఆలోచించకుండా.. అలా కుదరదని చెప్పేస్తారు. కానీ ఓ చోట బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అలా వచ్చిన సర్టిఫికెట్ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఓ కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఆ సర్టిఫికెట్‌ను సృష్టించాయి. ఇంతకీ ఆ డెత్ సర్టిఫికెట్ ఎవరిది..? బతికుండగానే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది..?
నంద్యాల డెత్ సర్టిఫికెట్ ఘటనలో ట్విస్ట్.. ఆస్తి కోసం భార్య మోసం చేసిందన్న భర్త.. తనకేం పాపం తెలియదంటూ తెరపైకి భార్య.. డెత్ సర్టిఫికెట్ వెనుక అత్త హస్తం ఉందంటున్న మహిళ.. తన భర్త పేరు రవికుమార్ కాదంటున్న హసీనా.. మహబూబ్ భాషా అంటూ ఆధారాలు చూపిస్తున్న లేడి.. మహబూబ్ బాషా పేరు రవికుమార్‌గా ఎందుకు మారింది..? నిజంగా అతడి తల్లే ఆ సర్టిఫికెట్ తీసుకుందా..? డెత్ సర్టిఫికెట్ వెనుక అసలేం జరిగింది..? ఏది వాస్తవం..? ఎవరిది అవాస్తం..?
మంచానికే పరిమితమైన రవికుమార్:
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన రవికుమార్…పాణ్యం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన హసీనాని 2001లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. రవికుమార్ ఫొటో గ్రాఫర్‌గా పని చేసేవాడు. 2011లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంచానికి పరిమితమయ్యాడు.
ఆస్తి కోసం భార్య పన్నాగం:
సీన్ కట్ చేస్తే…భర్త రవికుమార్, అతని తల్లి రమకు చెందిన ఆస్తిని హసీనా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆ తరువాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో రవికుమార్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలలో తప్పులు ఉండటాన్ని హసీనా గుర్తించింది. లక్షల విలువైన ఆస్తి తన పేరిట ఉన్నా…ప్రయోజనం లేకుండా పోయిందని గ్రహించింది. తప్పులను సవరించుకోవాలంటే భర్త సంతకం తప్పనిసరి అయింది. కానీ భర్త దూరంగా ఉండటంతో ఓ ఎత్తుగడ వేసింది.
తన భర్త చనిపోయాడని, డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు:
తన భర్త 2017లో చనిపోయాడని, మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని 2019లో నంద్యాల తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. తహసీల్దారు కార్యాలయం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్డీవో కార్యాలయ అధికారులు రవికుమార్ మృతి చెందినట్లు నిర్ధారించారు. దీని ఆధారంగా నంద్యాల మున్సిపల్ అధికారులు డెత్ సర్టిఫికెట్ మంజూరు చేశారు. ఆ తరువాత ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలకు భర్త డెత్ సర్టిఫికెట్ జత చేసి రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేసుకుంది.
న్యాయం చేయాలని కోరుతున్న భర్త:
ఈ విషయం ఆలస్యంగా తెలుగుసుకున్న రవికుమార్, తాను బతికే ఉన్నానని, తన భార్య ఆస్తి కోసం మోసగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకుండా తన పేరిట డెత్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని, ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
డెత్ సర్టిఫికెట్ మా అత్త తీసుకొచ్చింది:
ఇదిలా ఉండగా…తనకేం పాపం తెలియదంటూ తెరపైకి వచ్చిన హసీనా..ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అసలు తన భర్త పేరు రవికుమార్ కాదని..మహబూబ్ భాషా అంటూ ఆధారాలు చూపించింది. డెత్ సర్టిఫికెట్ తీసుకోవడంలో తన ప్రమేయం లేదని..మహబూబ్ భాషా తల్లి రమ ఆ పని చేసిందంటూ తెలిపింది. 2012లోనే భర్త, అత్త కలిసి తన పేరు మీద ఆస్తి రిజిస్ట్రర్ చేశారని చెప్పింది. తన భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకుని తల్లితో పాటు మమ్మల్ని వదిలేశాడని తెలిపింది. ఆస్తి నాశనం చేస్తాడనే కారణంతో అతడి తల్లే డెత్ సర్టిఫికెట్ సృష్టించి..తన పేరుపై ఆస్తి రాయించిందని చెప్పింది. తల్లి చనిపోయిన నాటి నుంచి ఆస్తి కోసం డ్రామాలు ఆడుతున్నాడని చెప్పుకొచ్చింది.
ఓ వైపు రవికుమార్ అలియాస్ మహబూబ్ భాషా…భార్య హసీనాపై ఆరోపణలు చేస్తుండగా…అటు హసీనా తనకేం తెలియదని..తన అత్తే డెత్ సర్టిఫికెట్ సృష్టించిదని చెబుతోంది. ఏది నిజమో తెలుసుకుందామంటే ఆ మహిళ చనిపోయింది. మరి..ఈ దంపతుల మధ్య ఆస్తి తగాదాలకు పోలీసులు ఎలా ఫుల్‌స్టాప్ పెడతారో చూడాలి.