Deputy Speaker Raghurama and Lokam Naga Madhavi
Deputy Speaker Raghurama Raju: ఏపీ అసెంబ్లీలో మంగళవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చేనేత రంగంపై మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉందని, ముడిసరుకుల ధరలు పెరిగి చేనేతలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ కారణంగా సుమారు రాష్ట్రంలో 50శాతం మగ్గాలు మూతపడిపోయాయని సభ దృష్టికి తెచ్చారు. గుజరాత్ రాష్ట్రంలోని బిజోడీ అనే గ్రామంలో కూలీలు నేతన్నలుగా మారి అధిక లాభాలు ఆర్జిస్తున్నారని, మన రాష్ట్రంలో మాత్రం నేతన్నలు మగ్గాలు మూసుకొని కూలీలుగా మారిపోతున్నారని పేర్కొన్నారు.
Also Read: Joe Biden: బైడెన్‌ను వెక్కిరిస్తూ వీడియోను షేర్ చేసిన రష్యా మీడియా.. అడవిలోకి వెళ్లిపోయిన బైడెన్..!
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల న్యాయం జరుగుతుందని చేనేతలు కోరుకుంటున్నారని, నేతన్నకు నెలకు నికర ఆదాయం రూ. 8వేలు నుంచి రూ.10వేలు వచ్చేలా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే నాగ మాధవి పేర్కొన్నారు. నేతన్నలకు ఇళ్లు ఇచ్చేటప్పుడు.. వారికి స్థలం ఉంటే షెడ్లు కట్టుకోవటానికి వేరే బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కమ్యూనిటీ షెడ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కల్పించుకొని.. ఇది ప్రశ్నోత్తరాల సమయం, మీరు సూచనలు చేస్తున్నారు. మీరు ప్రశ్నల రూపంలో సమయం వృథా చేయకుండా మీ ప్రశ్నలు అడగండి అంటూ సూచించారు.
డిప్యూటీ స్పీకర్ సూచన తరువాత ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. అయితే, చివరిలో ప్రభుత్వానికి ఆమె ఓ విజ్ఞప్తి చేశారు. నెలలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించేలా ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధన పెట్టేలా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. మీరు ఇప్పుడు ధరించిన చీర చేనేతదేనా అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో చేనేతదేనంటూ ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య ఫన్నీ సంభాషణతో సభలో నవ్వులు విరబూశాయి.