bandaru satyanarayana guntur bar association
Guntur Bar Association Dispute : ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు బార్ అసోసియేషన్ లో లాయర్ల మధ్య విబేధాలు బయటపడ్డాయి. బార్ అసోసియేషన్ లో లాయర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్ వచ్చిన తర్వాత ఆయనకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ బాబు సన్మానం చేశారు. సురేష్ బాబు తీరును వ్యతిరేకిస్తూ వైసీపీ అనుకూల న్యాయ వాదులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో లాయర్లు రెండు వర్గాలుగా విడిపోయి వాదోపవాదాలు చేసుకున్నారు.
బార్ అసోసియేషన్ ను టీడీపీ ఆఫీస్ గా మార్చారు : లాయర్ వెంకటరెడ్డి
మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. బండారు సత్యనారాయణను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చారని తెలిపారు. బెయిల్ వచ్చిన తర్వాత బండారును బార్ అసోసియేషన్ ఛాంబర్ లో సన్మానం చేశారని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ ను టీడీపీ ఆఫీస్ గా మార్చారని మండిపడ్డారు. క్షమాపణ చెప్పమంటే బార్ అధ్యక్షుడు సురేష్ బాబు క్షమాపణ చెప్పటం లేదన్నారు.
దీంతో సురేష్ బాబు తీరును ఖండిస్తున్నామని చెప్పారు. నిందితులకు బార్ అసోసియేషన్ తరుపున ఏ విధంగా మద్దతిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి పెట్టబోమని స్పష్టం చేశారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని లాయర్ మంజుల పేర్కొన్నారు. బండారుకు బెయిల్ వచ్చిన తర్వాత ఆయనకు బార్ ఛాంబర్ లోనే సన్మానం చేశారని వెల్లడించారు. నిందితుడికి సన్మానం చేయటంపై తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు.
Also Read: నారాయణ బినామీ ఆస్తులపై ఆమెను విచారించాలి.. వాళ్ల దగ్గర వందలకోట్లు దోచుకున్నాడు
ముగిసిన వివాదం
గుంటూరు బార్ అసోసియేషన్ లో లాయర్ల మధ్య తలెత్తిన వివాదం ముగిసింది. బండారు సత్యనారాయణ మూర్తిని సన్మానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశామని లాయర్ వెంకటరెడ్డి తెలిపారు. దీనిపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ పొరపాటు సంఘటనగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. దీంతో తమ ఆందోళన విరమించామని వెల్లడించారు. రాజకీయాలు ఉంటే బయట చూసుకుంటామని చెప్పారు.