ఏపీలో మూడో విడత రేషన్ : బయో మెట్రిక్ తప్పనిసరి

  • Publish Date - April 29, 2020 / 11:20 AM IST

ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఓ వైపు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూనే పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ చూస్తోంది. ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పేదలకు ఉపయోగపడే రేషన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రెండు విడతలుగా రేషన్ పంపిణీ చేసింది. తాజాగా..మూడో విడత పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 

ఇప్పటికే రెవిన్యూ అధికారులకు, డీలర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్. బియ్యం కార్డు దారులకు 2020, ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ చేయనుంది. కరోనా నిబంధనల మేరకు భౌతికదూరం పాటిస్తూ రేషన్ తీసుకునేలా చూడాలని డీలర్లకు సూచించారు. 

టైం స్లాట్ టోకెన్ లతో ఒక్కో షాపులో రోజుకు 30 మందికే సరుకుల పంపిణీ ఉంటుందన్నారు. మొదటి, రెండు విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించిన సంగతి తెలిసిందే. అయితే మూడోసారి విడతలో లబ్దిదారుల బయోమెట్రిక్ తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా అన్ని రేషన్ షాపుల వద్ద శానిటైజర్, మాస్కులు ఉండేవిధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రతి లబ్దిదారుడు బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకునేలా డీలర్లు జాగ్రత్త వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. 

పేద కుటుంబాలను ఆదుకోవడానికి, నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రతి కుటుంబానికి రూ. 1000లు కూడా ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే..అక్కడే దరఖాస్తు చేసుకుంటే..అర్హత కలిగిన వారికి వారం రోజుల్లో కార్డు వచ్చే విధంగా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.