YS Sharmila son YS Raja Reddy : రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి.? అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని..

కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది

YS Sharmila son YS Raja Reddy : రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి.? అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని..

YS Raja Reddy

Updated On : September 8, 2025 / 12:20 PM IST

YS Sharmila son YS Raja Reddy : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ వైఎస్ రాజారెడ్డి కర్నూల్ ఉల్లి మార్కెట్‌లో పర్యటించారు. తన తల్లి వైఎస్ షర్మిలతో కలిసి రాజారెడ్డి మార్కెట్‌కువెళ్లి ఉల్లి ధర, తదితర వివరాలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని వైఎస్ రాజారెడ్డి తల్లి షర్మిల వెంట మార్కెట్ సందర్శనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన త్వరలో రాజకీయ అరంగ్రేటంకు ఏర్పాటు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగప్రవేశంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతుంది. 1996 డిసెంబర్‌లో రాజారెడ్డి బ్రదర్ అనిల్, షర్మిల దంపతులకు జన్మించారు. హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన అతను.. డాలస్ యూనివర్శిటీలో బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ డిగ్రీ అందుకున్నారు. అమెరికాలో ఓ ప్రముఖ కంపెనీలో కొద్దిరోజులు రాజారెడ్డి ఉద్యోగం చేశారు. చిన్నతనంలోనే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన రాజారెడ్డి .. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉండేందుకు ఇష్టపడతారు.

గతేడాది అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం రాజస్థాన్ లోని బోధ్‌పుర ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా వివాహ వేడుక జరిగింది.

వైఎస్ షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. మరో నాలుగేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం పెద్దల సూచనలతో షర్మిల ముందుకెళ్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీవైపు రాష్ట్రంలోని యువతను ఆకర్షించేలా షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డిని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రైతులు, యువత, మధ్య తరగతి ప్రజలను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా రాజారెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారని వైఎస్ షర్మిల వర్గీయుల్లో చర్చ జరుగుతుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధిష్టానం పెద్దలు రాజారెడ్డి సేవలను పార్టీ బలోపేతానికి ఎలా ఉపయోగిస్తారు.. ఆయన అధికారిక పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది.. అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.