TTD Trust Board : ప్రముఖ ఆలయాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. గత సంవత్సరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శోభారాజును ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
అన్నమయ్య సంకీర్తనల ప్రచారం అంటేనే శోభరాజు గుర్తుకు వస్తారు. శోభారాజు 1957 నవంబర్ 30న చిత్తూరు జిల్లా వాయల్పాడులో జన్మించారు. వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమయ్య. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంగీత కళాకారిణిగా అన్నమయ్య పాటలకు కృషి చేశారు.
‘అన్నమాచార్య భావనా వాహిని’ అనే సంస్థను నెలకొల్పి వేలాది మందికి సంగీత శిక్షణ ఇచ్చారు. ఈ సంస్థ ద్వారా సంగీత శిక్షణ, సంగీత ఉత్సవాలు, అన్నమయ్య కీర్తనలపై పరిశోధన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆమె చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను 2010లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి 2013లో ఉగాది పురస్కారం స్వీకరించారు.