Indrakeeladri
Vijayawada Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై జన్మదిన వేడుకలు చేసుకోవటం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇంద్రకీలాద్రిపై జన్మదిన వేడుకలపై ప్రసారం చేసిన 10 టీవీ వరుస కధనాలకు దుర్గగుడి ఈవో బ్రమరాంబ స్పందించారు. ఇంద్రకీలాద్రిపై జన్మదిన వేడుకలు జరిగాయని ఈవో నిర్ధారించారు. ఈ మేరకు ఆయన 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంద్రకీలాద్రిపై శానిటేషన్ సూపర్ వైజర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఏడుగురు తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందిని తొలగించామని తెలిపారు.
ప్రత్యేక భద్రతా విభాగానికి చెందిన కానిస్టేబుల్ ను నిలిపివేశామని చెప్పారు. మరో ప్రైవేట్ సెక్యురిటీ గార్డును తొలగించామని వెల్లడించారు. అమ్మవారి చెంత ఇలాంటివి ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఉద్యోగస్తులు, సిబ్బంది జాగ్రత్తగా మెలగాలని సూచించారు. దేవస్ధానం సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Durga Temple : దుర్గగుడిపై పుట్టినరోజు వేడుకలు.. 9మంది సిబ్బందిపై వేటు
శానిటేషన్ సూపర్ వైజర్ బర్త్ డే సందర్భంగా గత బుధవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో అవుట్ సోర్సింగ్ శానిటరీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలోని మహారాజగోపురం ఎదుట కేక్ కట్ చేసి బర్త్ డే పార్టీ చేశారు. ఈ విషయం ఆలయ ఈవోకు తెలియటంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కొండపై పార్టీ చేసుకున్న ఏడుగురు శానిటరీ సిబ్బందిని విధులనుంచి తొలగించారు.
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుతో సహా, ఒక ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పై కూడా చర్యలు తీసుకున్నారు. మరునాడు ఈ సమాచారం తెలుసుకున్న ఆలయ ఈవో బ్రమరాంబ కొంత మంది సిబ్బందిని నియమించి జరిగిన ఘటనపై విచారణ జరిపించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బర్త్ డే పార్టీతో పాటు కొందరు మద్యం సేవించినట్లు తెలియటంతో ఈవో దృష్టి సారించి ప్రాధమిక విచారణ జరిపి చర్యలు చేపట్టారు.