Earthquake
Earthquake : ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా విశాఖ వాసులను భూకంపం వణికించింది. తెల్లవారు జామున విశాఖలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భారీ శబ్దాలతో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
విశాఖపట్టణంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో తెల్లవారు జామున 4.18గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్డులో భూమి కంపించింది. సింహాచలంలోనూ స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
Also Read: Road Accident : ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు..
భూ ప్రకంపనల వేళ పలు ప్రాంతాల్లో పెద్ద శబ్దాలు వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ హఠాత్పరిణామంతో విశాఖ ప్రజలు కలవరపాటుకు గురయ్యారు. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ స్వల్ప భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. అయితే, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7గా నమోదైనట్లు తెలిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ.మాడుగులలో భూకంప కేంద్రాన్నిగుర్తించారు. భూమి లోపల 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.