పిల్లి వారి లొల్లితో కేడర్ కన్ఫ్యూజన్, స్వపక్షంలో విపక్షం

  • Publish Date - December 13, 2020 / 11:34 AM IST

EGDT YSRCP Politics : వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఆయనకు ఎనలేని అభిమానం.. వారికోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేశారు. అలాంటి త్యాగశీలి ఇప్పుడు స్వపక్షంలోనే విపక్షంలా మారారు. కొత్తగా పార్టీలో చేరినవారిపై అధిష్టానానికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. అంతటి విశ్వాసపాత్రుడు ఇలా ఎందుకు మారారో తెలియక హైకమాండ్ తలపట్టుకుంటోంది. అటు పిల్లివారి లొల్లేందో తెలియక కేడర్కూ కన్ఫ్యూజన్ అవుతోంది.

వైసీపీ రియల్ వారియర్ :- 
పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఈ పేరు చెప్పనగా.. ఓ ఆయనా.. మహానభావుడు.. వైసీపీ రియల్ వారియర్ అంటూ ప్రశంసలతో ముంచేస్తారు ఆ పార్టీ కార్యకర్తలు. కానీ ఈ మధ్య ఆయన వ్యవహారశైలి సంచలనంగా మారింది. సుభాష్‌ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. కాకినాడ డీఆర్సీ సమావేశంలో జరిగిన రగడ పై విమర్శలు వెల్లువెత్తాయి. నువ్వెంత- నీ లెక్కంత అంటూ ద్వారంపూడి – పిల్లి ఢీ అంటే ఢీ అనడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ జోక్యం చేసుకుని ఇద్దరికి సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ద్వారంపూడిపై విమర్శలు :-
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్ కి నమ్మిన బంటు. ఆ విషయం బోసుకి బాగా తెలుసు. తెలిసి తెలిసి బోసు ద్వారంపూడిపై విమర్శలు చేశాడా? అలా ఎందుకు చేసుంటాడు అన్న అనుమానాలు కార్యకర్తల మెదళ్లను తొలుస్తాన్నాయంటున్నారు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై హోమి మినిస్టర్ సుచరితకు బోసు బహిరంగ లేఖ రాయడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. శిరోముండనం కేసు విషయంలో నిందితులు ఎవరూ తప్పించుకోలేరని.. ఆ కేసును వేగవంతం చేయాలని, పీపీని మార్చితే మరింత ఆలస్యం అయ్యే విధంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు..పాత కేసును కొత్తగా ఇప్పుడు తిరగదోడడం వెనుక పిల్లి వ్యూహమేంటో అర్దం చేసుకోవచ్చు.

బోసుకు రాజ్యసభ :-
సుభాష్ చంద్రబోసు.. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ కోసం మంత్రి పదవిని వదులుకుని ఆయనకు తోడుగా నిలిచారు. పిల్లి వైఎస్సార్ సిపి తరపున మండపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే సీఎం జగన్ బోసును ఎమ్మెల్సీ ని చేసి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన మంత్రి పదవి వదులుకోవాల్సి వచ్చింది. దీంతో సీఎం జగన్ బోసుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు.

ద్వారంపూడి జగన్‌కు నమ్మిన బంటు :-
అయితే మంత్రిగా కొనసాగినప్పుడు బోసు నోటి వెంట ఒక్క వివాదాస్పద మాటకూడా రాలేదు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి చంద్రబోసు స్వరం పెంచారు. తోట త్రిమూర్తులు విషయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ ప్రత్యర్ధులగా ఉన్నారు. శిరోమండనం విషయం సుమారు 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న అంశం కావడంతో ఆ విషయాన్ని కార్యకర్తలు పెద్దగా పట్టించుకోకపోయినా.. ద్వారంపూడి జగన్ కు నమ్మిన బంటు అయినప్పటికీ ఆయనపై విమర్శలు చేయడం వారికి మింగుడుపడటం లేదంటున్నారు. బోసుగారు ఎందుకిలా చేశారబ్బా అని కారణాలు వెతికే పనిలో పడ్డారట పలువురు నేతలు. ఏపీ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ లపై జరుగుతున్న దాడుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బోసు చేత తోట త్రిమూర్తులపై అధిష్టానమే లేఖ రాయించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. ఇదే అదనుగా ద్వారంపూడిపై ఆయన అక్కసు వెళ్లగక్కి ఉంటాడని భావిస్తున్నారు.