నిన్నటివరకు ఆ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. దీంతో ఆ జిల్లా వాసులు కొంత రిలాక్స్ గా ఉన్నారు. కానీ ఇంతలోనే ఆ జిల్లాలో కరోనా బాంబు పేలింది. ఎవరూ ఊహించని విధంగా ఒక్కరోజులోనే ఆ జిల్లాలో 13మందికి కరోనా సోకింది. అదే పశ్చిమగోదావరి జిల్లా. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఏపీలో 43 కొత్త కరోనా కేసులు నమోదవగా, ఒక్క ప.గో.జిల్లాలోనే 13 పాజిటివ్ కేసులు నమోదవడం స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది.
ఢిల్లీ నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా కరోనా నిర్ధారణ అయ్యింది. ఒక్కసారిగా కేసుల నమోదు కావడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మార్చేశారు అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర పేషెంట్లను ప్రైవేట్ కాలేజీల్లో ఆసుపత్రులు ఏర్పాటు చేసి అక్కడికి తరలించారు.
భయం నిజమైంది. ఏపీలో ఢిల్లీ బాంబు పేలింది. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కోవిడ్ 19 కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 87కి పెరిగింది. ఈ ఒక్కరోజే 43 మందికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలోనే కరోనా ఎక్కువగా ఉంది. దీంతో ఏపీలో కలకలం రేగింది. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేని రెండు జిల్లాల్లో ఒక్కసారిగా పదుల సంఖ్య కేసులు నమోదయ్యాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.
మంగళవారం(మార్చి 31,2020) రాత్రి 9 గంటల నుంచి బుధవారం(ఏప్రిల్ 1,2020) ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో తెలిపింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు తెలిపింది. గత 12 గంటల వ్యవధిలో 373మంది నమూనాలు పరీక్షించగా అందులో 330 నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.