Nellore GGH : నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, విచారణకు ఆదేశం

నెల్లూరు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లైంగిక వేధింపుల ఘటనను జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.

Nellore GGH : నెల్లూరు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆస్పత్రి(పెద్దాసుపత్రి) సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విద్యార్థినులపై సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనను జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో నేరం రుజువైతే సూపరింటెండెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంచార్జి కలెక్టర్ చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. లైంగిక వేధింపుల పర్వంపై జిల్లాలోని డాక్టర్లు, మెడికోలలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు మెడికోలు సైతం ఇంచార్జి కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.

నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ తీరు వివాదానికి దారితీసింది. ఆయనపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. సూపరింటెండెంట్, వైద్య విద్యార్థినికి మధ్య సంభాషణకు సంబంధించిన ఓ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. కోరిక తీర్చాలంటూ వైద్య విద్యార్థినులు, మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని సూపరింటెండెంట్ వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కారులో ఒంటరిగా రావాలని, తనతో గడపాలని వారిని బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో కొవిడ్ విధుల్లో ఉన్న ఓ వైద్య విద్యార్థినిని సైతం ఆ ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు గురిచేశాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ వైద్య విద్యార్థిని ఎదురు తిరిగింది. ఆ అధికారికి ఫోన్ లోనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. అతడిని కడిగిపారేసింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు సూపరింటెండెంట్ తనను ఎలా వేధించింది ఆ సంభాషణలో బాధితురాలు వెల్లడించింది. కూతురు వయసున్న ఆమె పట్ల ఆ వైద్యాధికారి వేధింపులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా బయటికి చెప్పుకోడానికి హౌజ్ సర్జన్లు, డాక్టర్లు భయపడుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం తమ తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మాన్పించేస్తారని పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మొత్తంగా ఈ ఆడియో టేపు బయటకు రావడంతో ఉన్నతాధికారి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. కీచక సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు