VV Lakshmi Narayana: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు అంశాలపై మాట్లాడారు. గతంలో జరిగిన అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో గొడవ ఏంటి? జనసేన నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? దీనికి ప్రధాన కారణం ఏంటో చెప్పారు లక్ష్మీనారాయణ.
”పవన్ కల్యాణ్ తో నాకు ఎలాంటి గొడవ లేదు. 2018లో నేను రిటైర్ అయ్యాక 2019లో రాజకీయాల్లోకి వచ్చాను. రిటైర్ అయ్యాక 8 నెలలు తిరిగా. రాజకీయాల్లో రావాలని నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తే ప్రజలు సుఖంగా ఉంటారన్న నిర్ణయంతో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న నినాదంతో వచ్చిన పవన్ కల్యాణ్ తో జాయిన్ అయ్యాను. 2014లోనూ పవన్ ను కలిశాను. అప్పటికి పవన్ పార్టీ పెట్టలేదు.
పవన్ పార్టీ పెట్టాక నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ ఎంపీ సీటు ఇచ్చారు. చాలా బాగా ప్రచారం చేశారు. ప్రచారంలో పవన్ కూడా పాల్గొన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేశారు. మంచి ఫలితాలు కూడా తీసుకురాగలిగాం. అదే సమయంలో పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్తారనే ప్రచారం మొదలైంది.
పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళితే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రెండు పడవల మీద వెళితే కరెక్ట్ కాదనిపించింది. అక్కడ పవన్ నిర్ణయాన్ని విభేదించి జనసేన నుంచి బయటకు వచ్చేశాను. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని వచ్చా. మార్పు కోరుకున్న ప్రజలు వనరులు ఇస్తారు. వనరులకు పెద్ద సమస్య ఉండదు. ఒక ధ్యేయంతో వచ్చారు. ఆ ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే అభిప్రాయంతో ఉండేవాడిని. మళ్లీ సినిమాల్లో నటించాలి అని పవన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అనే అభిప్రాయంతో నేను జనసేన నుంచి బయటకు వచ్చేశాను.
నేను పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి ప్రధాన కారణం పవన్ కు ఇచ్చిన లేఖలో తెలిపాను. మీరు మళ్లీ సినిమాల్లోకి వెళ్తున్నారు అనే నిర్ణయం తీసుకున్నారు. దాని వల్ల రాజకీయాలపై ప్రభావం పడొచ్చు. మీరు తీసుకున్న నిర్ణయంతో నేను ఏకీభవించలేకపోతున్నాను, కాబట్టి పార్టీ నుంచి తప్పుకుంటున్నాను అని పవన్ కు లేఖ ఇచ్చి జనసేన నుంచి బయటకు వచ్చేశాను” అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
Also Read: గుడ్‌న్యూస్… విద్యుత్ చార్జీల తగ్గింపుపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు