Justice NV Ramana : తెలుగు భాష మర్చిపోతే తెలుగుజాతి అంతం- ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉద్యోగం వస్తుందన్న భ్రమలో ఆంగ్లంపై మక్కువ పెంచుకుంటున్నామని ఆయన అన్నారు.

Justice NV Ramana (Photo Credit : Google)

Justice NV Ramana : కడప సీపీ బ్రౌన్ లైబ్రరీలో తెలుగు వైభవం ఉపన్యాస కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఈ సందర్భంగా తెలుగు భాష గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషను మర్చిపోతే తెలుగుజాతి అంతమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషను రెండో భాషగా పెట్టాలని అడుక్కునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంట్లో పిల్లలు తెలుగులో తమ పేరును రాయలేని పరిస్థితి ఉందని వాపోయారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష కొరవడిందన్నారు. మాతృభాష నేర్చుకుంటే ఎన్ని భాషలు అయినా నేర్చుకోవడం సులువు అవుతుందన్నారు ఎన్వీ రమణ. తెలుగు వారంతా మాతృభాషలోనే మాట్లాడాలని ఆయన సూచించారు.

ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉద్యోగం వస్తుందన్న భ్రమలో ఆంగ్లంపై మక్కువ పెంచుకుంటున్నామని ఆయన అన్నారు. తెలుగు భాష పై ఆంగ్ల భాష విపరీతమైన ప్రభావం చూపించిందన్నారు. ఆంగ్లంలో బోధించాలనే ఎస్ఎల్పీ సుప్రీంకోర్టులో ఉందని.. ఎస్ఎల్పీ విద్యా విధానాన్ని ఉపసంహరించుకుని పాత విద్యా విధానాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ ను కోరానని ఎన్వీ రమణ తెలిపారు. తెలుగు చరిత్రని, సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలుగు భాష పరిశోధన కేంద్రాన్ని.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు ఎన్వీ రమణ.

Also Read : జమిలిపై వైసీపీ ఆశలు.. ఎన్నికలకు రెడీ కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు