Chandrababu Naidu At Tirumala
Chandrababu Naidu : రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని స్వామివారిని ప్రార్ధించా అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి ఆయన శ్రీవారిని మహా లఘుదర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు చంద్రబాబునాయుడుకు వేదఆశీర్వచనం అందచేశారు.
ఆలయం బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన …. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి..మూడు రాజధానులు పెడతామని ప్రజలకు మాయమాటలు చెప్పడం కాదు అని అన్నారు. రాష్ట్రానికి రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని రాజధాని రైతులు 45 రోజులపాటు పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారిని దర్శించుకున్నారని… రైతుల పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనడానికి వచ్చానని ఆయన తెలిపారు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదని… ఐదు కోట్ల మంది ప్రజల సమస్య అని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం భవిష్యత్ తరాల భవిష్యత్ బాగుండేలా స్వామివారు ఆశీర్వదించాలి అని చంద్రబాబు పేర్కోన్నారు.
Also Read : Omicron Lockdown : లాక్‌డౌన్ దుష్ప్రచారాలు నమ్మవద్దు-డీహెచ్ శ్రీనివాస రావు
తిరుపతిలో జరిగే అమరావతి పరిరక్షణ మహోద్యమ సభలో చంద్రబాబు నాయుడుతోపాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు హాజరవుతారని ఆయా పార్టీల వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. జనసేన నుంచి పీఏసీ సభ్యులు హరిప్రసాద్..తిరుపతి నాయకుడు ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్.. కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలీ, రైతు సంఘాల నాయకులు హాజరు కానున్నారు.