Sv Prasad Passes Away
SV Prasad Passes Away : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఎస్వీ ప్రసాద్.. 1975 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.
నెల్లూరు జిల్లా సబ్‌కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్, కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు. 2010లో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు సీఎస్‌గా పనిచేశారు.
తన కంటే 20మంది సీనియర్ ఐఏఎస్ అధికారులున్నా ఎస్వీ ప్రసాద్‌నే సీఎస్ పోస్టు వరించింది. పదేళ్లకు పైగా ముగ్గురు సీఎంల దగ్గర ఎస్వీ ప్రసాద్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, చంద్రబాబు హయాంలో సీఎస్ గా పనిచేశారు.
ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో అందరినీ ముందుండి నడిపే అధికారిగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. నిత్యం అందుబాటులో ఉంటూ అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని చెప్పారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శిగా, విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్వీ ప్రసాద్ విశేషమైన సేవలందించారని, ఏపీ జెన్‌కో చైర్మన్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా ఆయా సంస్థల బలోపేతం కోసం కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. ఎస్వీ ప్రసాద్ కరోనా మహమ్మారిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని, ఇప్పుడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామన్నారు.