Cm Chandrababu On Rayalaseema: రాయలసీమకు రాబోయే ప్రాజెక్టులు ఇవే..! రతనాల సీమ చేస్తాం.. ఇది సీబీఎన్ మాట..
రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించబోయే వ్యూహం ఏంటి? సీమకు కొత్తగా రానున్న ప్రాజెక్టులు ఏవి? ఈ ప్రాంతం రూపురేఖలు ఎలా మారబోతున్నాయి?

Cm Chandrababu On Rayalaseema: అనంతపురంలో జరిగిన కూటమి పార్టీల బహిరంగ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడారు. రాయలసీమలో కరవును శాశ్వతంగా దూరం చేస్తామన్నారు చంద్రబాబు. ఇది మీ CBN మాట అని అన్నారు. సీమలో డిఫెన్స్, స్పేస్, ఏరో స్పేస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు చంద్రబాబు.
సోలార్, విండ్ ఎనర్జీతో ఈ ప్రాంతానికి కొత్త ఎనర్జీ ఇస్తామన్నారు. ఇక రాయలసీమ రాళ్ల సీమ కాదు.. రతనాల సీమ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రోడ్లు, ఎయిర్ పోర్టులు, రైల్వే లైన్లు, పరిశ్రమలు, హార్టికల్చర్ సాగుతో రత్నాలసీమ అవుతుందన్నారు. ఎవరు అడ్డుపడినా సీమ అభివృద్ది ఆగదు, ఇది నా భరోసా అని చంద్రబాబు అన్నారు.
”కేంద్రంలో, రాష్ట్రంలో మనదే ప్రభుత్వం. డబుల్ ఇంజన్ సర్కార్.. డబుల్ డిజిట్ గ్రోత్. సంపద సృష్టిస్తా. పేదలకు సంపద పంచుతా. జాతీయ స్థాయి కంటే మెరుగ్గా జీఎస్డీపీ గ్రోత్ పెరిగింది. సంక్షేమం బాగుంది.. అభివృద్ధి బాగుంది.. గుంతలు పూడ్చాం. ఇవి జరుగుతుంటే వైసీపీ ఉనికి కోల్పోతోంది. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు తగులుతోంది.
ఐదేళ్లు వాళ్లు చేయలేని పనిని 100 రోజుల్లో మేము చేశాం. పత్తికొండ, జీడిపల్లి, పెన్నా అహోబిలం, గొల్లపల్లి, చెర్లోపల్లి, అడవిపల్లి, గాజులదిన్నె ప్రాజెక్టులు నింపుతున్నాం. మరోవైపు గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు నింపుతున్నాం. రాయలసీమ అంటే తిరుపతి నుంచి శ్రీశైలం వరకు మహా పుణ్యక్షేత్రాలు. అనేక ప్రసిద్ద ఆలయాలు. సమర్థ నీటి నిర్వహణతో సీమకు జలకళ తెచ్చాం” అని చంద్రబాబు అన్నారు.