అమరావతిలో భారీ భూకుంభకోణం జరిగింది, చంద్రబాబు చేసిన అప్పులన్నీ తీర్చాం- ఆదిమూలపు సురేశ్

9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం.

Adimulapu Suresh : అమరావతిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్రంగా స్పందించారు. అమరావతిపై చంద్రబాబుది శ్వేతపత్రం కాదు పచ్చపత్రం అంటూ విమర్శించారు. జగన్ పాలనపై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారని ఎదురుదాడికి దిగారు. అమరావతి స్మార్ట్ సిటీ, కోర్ కేపిటల్ అభివృద్ధి వంటివన్నీ తమ పాలనలో ముందుకు తీసుకెళ్లామని ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. అంతేకాదు చంద్రబాబు చేసిన అప్పులన్నీ తీర్చామని స్టేట్ మెంట్ ఇచ్చారాయన.

‘అసలు అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు ఎంత? చేసిన అప్పులు ఎంత? ఆ వివరాలు కూడా చంద్రబాబు తన శ్వేతపత్రంలో చెబితే బాగుండేది. సంపద సృష్టిస్తానని పదే పదే చంద్రబాబు అంటున్నారు. ఆ సంపద ఎవరి కోసం సృష్టిస్తారో చెప్పాలి? తన వారికే సంపద సృష్టిస్తారా? ప్రజలందరికీ చేస్తారా? రాజధాని ప్రాంతంలో భూమి లేని కూలీలకు కూడా జగనే పెన్షన్ పెంచారు. 9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం.

రాజధాని కడతానన్న చంద్రబాబు కనీసం రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను కూడా ఎందుకు ఇవ్వలేదు? రాజధాని ప్రకటన జరిగే లోపు అమరావతిలో పెద్దఎత్తున భూకుంభకోణం జరిగింది. 2014 జూన్ నుండి డిసెంబర్ మధ్యలో వేలాది ఎకరాలు చేతులు మారాయి. ఇది ఎలా జరిగిందో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. రాజధానిలో ఇప్పటి పరిస్థితికి టీడీపీదే బాధ్యత. సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఎందుకు పూర్తి చేయలేదు? ఆ రోడ్ మీద వెలుగుతున్న లైట్లు కూడా మా హయాంలో వేసినవే. దాన్ని కూడా తామే వేసినట్టు చంద్రబాబు చెప్పుకోవటం హాస్యాస్పదం.

రాజధానిలో 1400 ఎకరాలను 52వేల మందికి పట్టాలు ఇచ్చాం. దానిపై చంద్రబాబు తన శ్వేతపత్రంలో ఎందుకు ప్రస్తావించలేదు? అమరావతిలో 17 అంగన్ వాడీ సెంటర్లు, 14 స్కూళ్ల నిర్మాణం చేశాం. చంద్రబాబులా గ్రాఫిక్స్ చేయలేదు. నిర్మాణాలు పూర్తి చేసి చూపించాం. అమరావతి మీదుగా వేసిన వెస్ట్ బైపాస్ నిర్మాణం మా హయాంలోనే చేశాం. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?

చంద్రబాబు ఐకానిక్ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్ లో చూపిస్తే.. జగన్ వాస్తవ రూపంలో నిర్మించి చూపారు. రూ.841 కోట్లు రైతులకు కౌలు కింద అందించాం. కూలీలకు పెన్షన్ కింద రూ.580 కోట్లు అందించాం. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కేంద్రం నుండి మట్టి, నీళ్లు తప్ప ఏం సాధించారు? ఇప్పుడైనా నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి. ప్రజలకు చేస్తామన్న సంక్షేమ మేలును పూర్తి చేయాలి. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను త్వరగా ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు ఆదిమూలపు సురేశ్.

Also Read : జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా? ప్రజలు ఆలోచించుకోవాలి- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు