5 కోట్ల మంది ఆంధ్రులు ఏం పాపం చేశారు?: కంటతడి పెట్టిన సీఎం చంద్రబాబు

ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు.

5 కోట్ల మంది ఆంధ్రులు ఏం పాపం చేశారు?: కంటతడి పెట్టిన సీఎం చంద్రబాబు

CM Chadrababu Naidu : రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఆంధ్రులు ఏం పాపం చేశారు? దేశానికి అన్నం పెట్టిన మనం ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏంటి? యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి అంటూ.. చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. ఐదేళ్లలో అమరావతిని సర్వనాశనం చేశారు అంటూ తీవ్ర ఆవేదన చెందిన చంద్రబాబు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంతటి విధ్వంసానికి కారకుడైన జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

”ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ కలుగుతోంది. చేసిన కష్టం మొత్తం వృథా అయిపోయింది. అది చూసినప్పుడు ఏమాత్రం నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తోంది. ఇంత కష్టపడితే ఇలా చేయడం దుర్మార్గం. జాతి ద్రోహం ఇది. నాకు కాదు. నేను నిమిత్త మాత్రుడిని. ఆ రోజు మాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తద్వారా ప్రజలు మళ్లీ నిలదొక్కుకోవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకుపోయాం.

జగన్ చేసిన పనుల వల్ల ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయింది. పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రాలేదు. ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా. మేము ఎందుకు రిస్క్ చేయాలి అని పెట్టుబడుదారులు భయపడ్డారు. బ్రాండ్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు.

ఈ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారు? రాజధాని లేదు అని చెప్పుకునేంత పాపం ఏం చేశారు? ఇక్కడి వారు అవకాశాల కోసం బయటకు వెళ్తే పర్లేదు. కానీ, ఇక్కడ అవకాశాలు లేక బయటకు వెళ్లాల్సిన కర్మ ఏం పట్టింది? ఇక్కడ గోదావరి, కృష్ణ పుణ్య నదులు ఇక్కడున్నాయి. బంగారం పండించే భూములు ఉన్నాయి, రైతాంగం ఉంది. ఆంధ్రప్రదేశ్ రౌస్ బౌల్ ఆఫ్ ఇండియా. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. తీర ప్రాంతం కలిగి ఉంది. దేశంలోనే నెంబర్ 1 ఇది. సన్ రైజ్ స్టేట్ ఇది. ప్రపంచం మొత్తం రాణించే యువత ఇక్కడ ఉంది. అలాంటి ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. ఇది చాలా బాధాకరం.

Also Read : ఆ కేసులు రీఓపెన్..! వైసీపీ కీలక నేతలే టార్గెట్‌గా ఉచ్చు బిగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

జగన్ ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అర్హత ఉందా? అనేది ప్రజలు ఆలోచించాలి. నేను ఆవేశంగా మాట్లాడటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టారని అలా అనడం లేదు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదే పదే చెబుతున్నా.. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్టుకు అర్హుడా? రాజకీయాలకు అర్హుడా? అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది” అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.