ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం విధానం ఏంటో సీఎం చెప్పాలి- మాజీమంత్రి విడదల రజిని

ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్ లో లిమిట్ కేవలం ఐదు లక్షలే.

Rajini Vidadala : ఆరోగ్యశ్రీ పథకంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానం ఏంటో సీఎం చంద్రబాబు వెల్లడించాలని మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్ చేశారు. అప్పులు, బకాయిల పేరుతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుండి వైదొలుగుతుందా అన్న భయం ప్రజల్లో నెలకొందని ఆమె వాపోయారు. అలాగే, ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా కొనసాగిస్తారో లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

”ఆరోగ్యశ్రీపై ప్రభుత్వ విధానం ఏంటో వెల్లడించాలి. అప్పుల సాకుతో ఆరోగ్యశ్రీ నుంచి ప్రభుత్వం వైదొలుగుతుందా? అనే భయం ప్రజల్లో నెలకొంది. కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్రమంత్రి పెమ్మసాని చెబుతున్నారు. సీఎం చంద్రబాబు మనసులోని మాటలనే ఆయన చెబుతున్నారా? ఆయుష్మాన్ లిమిట్ రూ.5లక్షలే. ఆరోగ్యశ్రీ లిమిట్ ను జగన్ రూ.25లక్షలకు పెంచారు.

ప్రజల ఆరోగ్యానికి ఏ ప్రభుత్వమైనా అధిక ప్రాధాన్యత ఇస్తుంది. జగన్ పాలనలో అనేక పథకాలతో పేదలకు మెరుగైన వైద్యం అందించాం‌. తెలుగు వాళ్ళందరూ ఆరోగ్యశ్రీ పథకం గురించి గర్వంగా చెప్పుకుంటారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీకి ఏడాదికి 3వేల కోట్లు ఖర్చు చేశాం. అప్పులు, బకాయిల పేరుతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుండి వైదొలుగుతుందా అన్న భయం ప్రజల్లో నెలకొంది? పెండింగ్ బిల్స్ చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని అంటున్నారు. చంద్రబాబు మనసులో మాటలనే మంత్రులు చెబుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది.

ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్ లో లిమిట్ కేవలం ఐదు లక్షలే. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం 300 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అందించాం. ఆరోగ్యశ్రీపై ప్రస్తుత ప్రభుత్వ విధానమేంటో సీఎం వెల్లడించాలి. మొదటి విడతలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. వచ్చే నెలలో మరో 5 కాలేజీలు ప్రారంభించేందుకు మా హయాంలో అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నెలలో 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రారంభిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలి.

ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మా హయాంలో తీసుకొచ్చాం. మారుమూల గ్రామాల్లో ఉన్న రోగులకు ఎంతగానో ఈ విధానం ఉపయోగపడింది. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగిస్తారో లేదో స్పష్టత ఇవ్వాలి” అని విడదల రజిని డిమాండ్ చేశారు.

Also Read : పొలిటికల్ బ్రదర్స్.. సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్న పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌

 

ట్రెండింగ్ వార్తలు