Prakasam Barrage Boats Incident : ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఎట్టకేలకు సాధించారు. ఓ భారీ బోటు బయటకు వచ్చింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. 40 టన్నుల బరువున్న భారీ బోటును బెకెం ఇన్ ఫ్రా సంస్థ ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళిక అమలు చేసి భారీ బోటును ఒడ్డుకు తెచ్చారు బెకెం ఇన్ ఫ్రా ఇంజినీర్లు.
ఇప్పటివరకు 4 రకాల ప్లాన్లతో శతవిధాలుగా ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. బోట్లు చుక్కలు చూపించాయి. అయితే, 5వసారి సరికొత్త వ్యూహాన్ని అమలు చేసి ఓ భారీ బోటును ఒడ్డుకు తెచ్చారు. డ్రెడ్జింగ్ చేసే రెండు భారీ బోట్లకు గడ్డర్లను అమర్చి చిక్కుకున్న పడవను ఒడ్డుకు తరలించారు.
బుధవారం మిగిలిన భారీ బోట్లను ఇదే విధానంలో బయటకు తీసే ప్రక్రియను ఇంజినీర్లు కొనసాగించనున్నారు. గేట్ల దగ్గర చిక్కుకున్న భారీ పడవను పున్నమి ఘాట్ వద్ద ఒడ్డుకు చేర్చారు ఇంజినీర్లు. బ్యారేజీ ఎగువన కిలోమీటర్ పైగా దూరంలో ఉన్న పున్నమి ఘాట్ వద్దకు బోటును చేర్చారు.
ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న భారీ బోటును వెలికితీసిన సిబ్బందిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. బ్యారేజ్ కు నష్టం వాటిల్లకుండా 8 రోజులు నుండి చేస్తున్న కృషి ఫలించిందన్నారు. మిగిలిన రెండు బోట్లను కూడా వెలికి తీస్తామని మంత్రి చెప్పారు.
Also Read : ఇంటికి రూ.25వేలు- వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు