Prakasam Barrage Boats Removal : ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు బోట్లను అధికారులు బయటకు తీశారు. మిగిలిన వాటిని వెలికితీసేందుకు ఆపరేషన్ బోట్ కొనసాగుతోంది. ముందు నుంచి చెబుతున్నట్లుగానే బోట్ల వెలికితీత ప్రక్రియ పూర్తవడానికి నాలుగు రోజులు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. అలాగే బోటు వెలికితీత సిబ్బంది కూడా తెలిపారు. ఇప్పుడు రెండు బోట్లు బయటకు వచ్చాయి. ఇవాళ రెండో బోటుని వెలికితీసిన బెకెం ఇంజినీర్ల బృందం దాన్ని పున్నమి ఘాట్ వైపు తరలిస్తోంది.
ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియలో ఇప్పటివరకు రెండు బోట్లను బయటకు తీశారు. మరో రెండు బోట్లు నీటిలోనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఒక బోటును తీశారు. తాజాగా ఇవాళ మరో బోటుని వెలికితీశారు. మరో రెండు నీటి లోపల అడుగు భాగంలో ఉన్నాయి. వాటిని విశాఖకు చెందిన బృందం లోపల డ్రిల్లింగ్ తో రంథ్రాలు వేసి బయటకు తీయాల్సి ఉంటుంది. దీనికి సమయం పడుతుందని ఇంజినీర్ల బృందం చెబుతోంది.
Also Read : జగన్‌పై మాజీమంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు.. పవన్‌పై ప్రశంసల వర్షం..
బెకమ్ సంస్థ ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, విశాఖ, కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు బోట్లను వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లను తొలగించే ప్రక్రియలో 11వ రోజున ఎట్టకేలకు రెండింటిని బయటకు తీయగలిగారు. మరో రెండు మూడు రోజుల్లో మిగతా వాటిని కూడా వెలికితీస్తామని చెబుతున్నారు.
బోట్ల వెలికితీత ప్రక్రియలో బెకమ్ కంపెనీ ఇంజినీర్లు, వైజాగ్‌కు చెందిన సీ లయన్ సంస్థ, అబ్బులు టీం కలిసి సంయుక్తంగా పని చేస్తున్నాయి. రేపు ఉదయం విశాఖకు చెందిన టీమ్ పనులు మొదలు పెడుతుందని ఇంజినీర్ల బృందం తెలిపింది. నీటి లోపల అడుగు భాగంలోకి వెళ్లి బోట్లకు డ్రిల్లింగ్ వేస్తారు. ఆ తర్వాత విశాఖకు చెందిన టీమ్ ఐరన్ రోప్ కు లింక్ చేస్తుంది. ఆ తర్వాత కాకినాడ టీమ్ వాటిని వెలికితీస్తుంది. ఈ ప్రక్రియ అంతా రేపు ఉదయం మొదలు పెడితే ఎల్లుండికి పూర్తవుతుందని చెబుతున్నారు. మొత్తంగా మిగిలిన రెండు బోట్లను బయటకు తీసుకురావడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని ఇంజినీర్ల బృందం చెబుతోంది.
సెప్టెంబర్ 1న భారీ వరద ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకొచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద గేట్లను పైకి లేపేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకుపోయింది. మరో 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ గేట్ల వద్దే చిక్కుకుపోయాయి. వీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనుక భారీ కుట్ర కోణం ఉందని టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు.