Explosion In East Godavari: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో పేలుడు.. భయాందోళనలో గ్రామస్తులు
వెంటనే ఇక్కడి నుంచి ప్లాంట్ ను తరలించేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
- Naveen
- Published on- April 20, 2026 / 04:43 PM IST
Explosion In East Godavari: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో పేలుడు సంభవించింది. పంగిడి గ్రామంలోని రిలయన్స్ బయో గ్యాస్ కంపెనీలో పేలుడు జరిగింది. దాంతో ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కంపెనీ గేటు ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్య బయో గ్యాస్ ట్యాంకర్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ కు సంబంధించి గ్రామస్తులు గతంలోనే అనేకసార్లు అభ్యంతరం తెలిపారు. బయో గ్యాస్ ప్లాంట్ ను అక్కడి నుంచి తరలించాలని ఆందోళనలు కూడా చేశారు.
ప్రస్తుతం వేసవి కాలం. ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. ఎండ తీవ్రతతో పేలుడు సంభవించినట్లుగా కార్మికులు చెబుతున్నారు. పేలుడు తర్వాత దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇది గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి గ్రామస్తులు ప్లాంట్ దగ్గరికి వెళ్లారు. గేటు దగ్గర కార్మికులు, గ్రామస్తులకు వాగ్వాదం జరిగింది. ఎండ వేడి వల్ల పైకప్పు పేలింది, అంతకుమించి ఏమీ ఇబ్బంది లేదని ప్లాంట్ కు సంబంధించిన సిబ్బంది చెప్పారు. అయితే గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము గ్రామంలో ఉండాలా? వద్దా? అంటూ కార్మికులతో వాగ్వాదానికి దిగారు.
వెంటనే ఇక్కడి నుంచి ప్లాంట్ ను తరలించేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్లాంట్ లోని బయో గ్యాస్ ట్యాంకర్ పేలడం, పైకప్పునకు మంటలు వ్యాపించడం, దట్టమైన పొగలు కమ్మేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని వారు కంగారు పడుతున్నారు.
Also Read: పాత రూ. 500 రూ. 1000 నోట్లు మళ్లీ మార్చుకోవచ్చా? RBI కొత్త రూల్స్ ఇవేనా? అసలు నిజం ఇదే..!
