ఎలా ఉన్నారో..వింత ఫ్యామిలీ : నాలుగేళ్లు..నాలుగు గోడల మధ్యే

  • Publish Date - February 2, 2020 / 07:22 AM IST

మనస్పర్థలు వచ్చినా… గొడవలు జరిగినా.. మనం మనుషులతో మాట్లాడకుండా ఎంతకాలం ఉండగలం?. మహా అయితే ఓ గంట.. లేదంటే ఒకరోజు.. అదీకాదంటే.. ఒకవారం. కానీ.. వారం కాదు, నెలకాదు.. ఏకంగా ఏళ్ల తరబడి ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటోంది ఓ ఫ్యామిలీ. అదికూడా ఏ కారణం లేకుండానే.. ఎవరితోనూ గొడవపడకుండానే… అందుకే ఆ కుటుంబం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

మంచి ఇల్లు… చక్కని కుటుంబం… చీకూ చింతాలేని జీవితం. అంతా ఆనందంగా ఉన్నారు. కానీ.. ఏం జరిగిందో తెలియదు. సడెన్‌గా ఆ కుటుంబం జీవనశైలి మారిపోయింది. వారు ఇల్లు వదిలి బయటికి రావడంలేదు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వెలుగుచూసిన ఈ వింత ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
 

వివరాల్లోకి వెళితే..
ఈసపు ఈశ్వరరావు అనే వ్యక్తి… తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. ఈ కుటుంబం కొన్నేళ్లుగా వింతగా ప్రవర్తిస్తోంది. తమ కుటుంబంలోని నలుగురితో తప్ప మరెవరితోనూ వీరు మాట్లాడటంలేదు. ఎప్పుడు చూసినా ఇంట్లోనే గడియపెట్టుకుని ఉంటున్నారు. ఎవరినీ లోపలకు రానీయరు. అయితే… తమ జీవనానికి కావాల్సిన సరుకులు, వస్తువుల కోసం మాత్రం.. అప్పుడప్పుడూ బయటికి వస్తారు. అప్పుడు కూడా అదే తీరు. ఎవరితోను మాట్లాడరు. తెలిసిన వారు కనిపించినా పలకరించరు. ఎవరైనా పలకరించినా స్పందించరు. స్థానికులతోనే కాదు.. బంధువులతోనూ వీరు మాట్లాడరు. అందుకే వీరి ఇంటికి ఎవరూ రారు. ఇలా నాలుగేళ్లుగా బతుకుతున్నారు. 

గతంలో వీరి పిల్లలు ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివేవారు. ప్రస్తుతం వారు స్కూలుకు కూడా వెళ్లడంలేదు. తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. రెండు నెలల క్రితం ఈ విషయం తీసుకున్న అధికారులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పిల్లలను స్కూలుకు పంపించాలని ఒప్పించారు. అయినా ఈ దంపతుల ప్రవర్తనలో ఇసుమంతైనా మార్పురాలేదు. ఇప్పటికీ అలాగే ప్రవర్తిస్తున్నారు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

స్థానికంగా వీరి వింత ప్రవర్తన విస్తృత చర్చకు దారితీయడంతో మీడియా ప్రతినిధులు వారి ఇంటికి వెళ్లి పలకరించారు. కానీ.. వారిచ్చిన సమాధానాలతో అందరూ అవాక్కయ్యారు. సీఎం జగన్ తనకి ఛాన్సిస్తే… తమ జిల్లా పాలన అంతా తానే చూస్తానంటున్నాడు ఈశ్వరరావు. ఏపీలో విద్యావిధానం బాగా లేదని, ఫీజులు తగ్గించాలని, అమ్మఒడి వంటి కార్యక్రమాలు కార్పొరేట్ స్కూల్స్ కి ఎందుకంటూ పొంతనలేని వాదనలు వినిపించాడు. 

ఈ కుటుంబం విషయం తెలుసుకున్న అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు… ఈ దంపతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కనీసం పిల్లలను స్కూల్ కి పింపించాలని బ్రతిమాలాడారు. మొదట ససేమిరా అన్న ఆ భార్యాభర్తలు… చివరికి ఓకే అన్నారు. పిల్లలను స్కూలుకు పంపేందుకు ఒప్పుకున్నారు.

అయితే.. ఆ కుటుంబం ఏదో  మానసిక సమస్యతో బాధపడుతోందని… ఆ సమస్యను తెలుసుకోవడంతోటు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు బొబ్బిలి ఏఏస్పీ గౌతమి శాలి. పిల్లలను పాఠశాలకు పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Read More : కలకలం : విశ్వహిందు మహాసభా లీడర్ కాల్చివేత