రైతు పంట పండింది..! పొలంలో దొరికిన విలువైన వజ్రం, దాన్ని ఏం చేశాడంటే..

ముగ్గురు వ్యాపారులు కలిసి సిండికేట్ అయ్యి తక్కువ ధరకే వజ్రాలు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది.

Diamond : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలంలో విలువైన వజ్రం లభ్యమైంది. మద్దికెర మండలంలో హంప గ్రామానికి చెందిన రైతుకు ఈ వజ్రం దొరికింది. దీని విలువ 10లక్షలకు పైనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పొలం దున్నుతున్న సమయంలో దొరికిన ఈ వజ్రాన్ని పెరవలి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం.

5లక్షల నగదు, 3 తులాల బంగారం ఇచ్చి వజ్రం కొనుగోలు..
5లక్షల రూపాయల నగదు, 3 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో మధ్యవర్తులను పెట్టి జొన్నగిరి, పెరవలి, గుత్తికి చెందిన ముగ్గురు వ్యాపారులు వజ్రాలను కొంటున్నట్లు సమాచారం. ముగ్గురు వ్యాపారులు కలిసి సిండికేట్ అయ్యి తక్కువ ధరకే వజ్రాలు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది.

వానాకాలం వచ్చిందంటే అందరి చూపు పత్తికొండపైనే..
పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా రైతుకు వజ్రం దొరికింది. దాని విలువ 10 లక్షల రూపాయలకు పైనే ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఓ వ్యాపారి రైతు నుంచి తక్కువ ధరకే డైమండ్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో వజ్రాలకు పెట్టిన పేరు పత్తికొండ. ఈ నియోజకవర్గంలోని తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో నిత్యం వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. వానా కాలం వస్తోందంటే చాలు.. అందరి చూపు పత్తికొండ నియోజకవర్గంపైనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో వజ్రాల వేట..
ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో వజ్రాల వేట సాగిస్తారు. వ్యవసాయ పొలంలో ఏదైనా పనులు చేస్తున్నారా అనే రీతిలో ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పటివరకు చాలా మందికి విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి. కొందరి లైఫ్ టర్న్ అయ్యింది. అయితే, విలువైన వజ్రాలు దొరికినా.. కొందరు వ్యాపారులు సిండికేట్ అయ్యి తక్కువ ధరకే వజ్రాలు కొనుగోలు చేస్తున్నారు.

ప్రభుత్వ ఖజానాకు గండి…
వ్యాపారులు ప్రతి ఏటా లక్షల విలువైన వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ విషయం ఓపెన్ గా తెలుస్తున్నా.. అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే విధంగా వజ్రాల కొనుగోళ్లు జరుగుతున్నాయి. వజ్రాలు ఏ ప్రాంతంలో అయితే లభ్యం అవుతున్నాయో.. ఆయా పంచాయితీల అభివృద్ధికి వ్యాపారులు కనీసం కూడా సహకరించరని స్థానికులు వాపోతున్నారు.

Also Read : టీవీ, వాషింగ్ మెషీన్, ఏసీ ధరలు పెరగనున్నాయా? ఎర్ర సముద్రంలో సంక్షోభమే కారణమా..

ట్రెండింగ్ వార్తలు