* ఉధృతమవుతోన్న రైతుల ఆందోళనలు.
* కమిటీగా ఏర్పడిన రైతులు.
* భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రైతులు.
అమరావతి ప్రాంత రైతుల ఆందోళలను మరింత ఉధృతమౌతున్నాయి. నాలుగు రోజులుగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్లెక్కి..ఆందోళనలు..నిరసనలు నిర్వహిస్తున్నారు. 2019, డిసెంబర్ 22వ తేదీ ఆదివారం మరింతగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నాలుగు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. 29 గ్రామాలకు చెందిన రైతులంతా ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆదివారం నిర్వహించనున్న నిరసనలకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించారు.
ఉదయం ఎనిమిదిన్నర నుంచే రైతుల నిరసనలు హోరెత్తనున్నాయి. మొత్తం నాలుగుచోట్ల వారి నిరసనలు కొనసాగనున్నాయి. రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో వంటావార్పు కార్యక్రమంతో నిరసన తెలుపనున్నారు. ఉదయం ఎనిమిదిన్నరకు ప్రారంభమై.. సాయంత్రం వరకు కొనసాగనుంది.
నాలుగు మండలాల్లో రైతులు మహాధర్నాను నిర్వహించనున్నారు. తుళ్లూరు, మందడం, రాయపూడి, పెద్దపరిమిలో మహాధర్నాలు కొనసాగుతాయి. ఇక వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నారు. 29 గ్రామాల రైతులు…ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు.
మరోవైపు రాజధాని ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. జనసేనతోపాటు వామపక్షపార్టీలు మద్దతు ప్రకటించాయి. వెలగపూడిలో రైతు రిలే నిరాహార దీక్షలకు హైకోర్టు న్యాయవాదులు మద్దతు తెలిపారు. రైతులకు సంఘీభావంగా సోమవారం, మంగళవారం తమ విధులు బహిష్కరించనున్నట్టు తెలిపారు. రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వంపైనా.. జీఎన్‌రావు కమిటీపైనా పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతామని తెలిపారు.
Read More : రాజధాని రైతులపై పోలీసు కేసులు