Corona Fish Market
Corona Fish Market : విజయవాడలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆదివారం చేపల మార్కెట్ ను మూసేయాలని నిర్ణయించారు. చేపల విక్రయానికి అనుమతి లేదంటూ ఇప్పటికే ప్రకటించారు అధికారులు. చికెన్, మటన్ విక్రయాలు మాత్రం యథావిథిగా జరగనున్నాయి.
విజయవాడలోని చేపల మార్కెట్లలో ప్రతి ఆదివారం విపరీతమైన రద్దీ నెలకొని ఉంటోంది. కొనుగోలుదారులు భౌతికదూరం నిబంధన ఉల్లంఘిస్తున్నారు. కొంతమంది అయితే మాస్కు సైతం పెట్టుకోవడం లేదు. దీంతో కరోనా మరింతగా వ్యాపిస్తోంది అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చికెన్, మటన్ మార్కెట్లలోనూ విపరీతమైన రద్దీ నెలకొని నిబంధనలు ఉల్లంఘిస్తే వాటినీ మూసేస్తాం అంటున్నారు అధికారులు. మార్కెట్ లో రద్దీని నియంత్రించడం ద్వారా కరోనాను కట్టడి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.